టెన్త్ పరీక్షలు మార్చి 26 నుంచి
- ఏప్రిల్ 11తో ముగియనున్న పరీక్షలు
- షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2015 మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 12 రోజులు జరగనున్న ఈ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.ఉషారాణి పాల్గొన్నారు.
విభజన తరువాత ఏపీలోని 13 జిల్లాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి వివరించారు. మిగతా పబ్లిక్ పరీక్షలకు ఇబ్బంది లేకుండా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు.
ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అది ఇచ్చే నివేదికను పరిశీలించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పద్ధతి అమలుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.