ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మునిసిపాలిటీలకు కూడా..
♦ నేడు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల జారీ
♦ 15 రోజుల్లోనే ఎన్నికల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు పురపాలికల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లను ఆదివారమే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్చి తొలి వారంలో రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈ ఎన్నికలు ముగియనున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే మార్చి 6న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పై మూడు పురపాలికల్లోని డివిజన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.
సిద్దిపేటకు తొలగని న్యాయ చిక్కులు
మంత్రి టి.హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట పట్టణానికి సైతం ఇదే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరి క్షణంలో విఫలమయ్యాయి. సిద్దిపేటలో ఆరు శివారు గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో కొంత కాలంగా ఈ మునిసిపాలిటీ ఎన్నికలపై స్టే అమల్లో ఉంది. స్టే తొలగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు వేచిచూస్తే ఎన్నికలను బడ్జెట్ సమావేశాల కంటే ముందు నిర్వహించలేమని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ చిక్కులు తొలగిన తర్వాత సిద్దిపేటతో పాటు దుబ్బాక, కొల్లాపూర్, మేడ్చెల్ మునిసిపాలిటీలకు మరో విడతలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు మార్చి 6న!
Published Sun, Feb 21 2016 3:46 AM | Last Updated on Tue, Aug 21 2018 12:18 PM
Advertisement