
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి గాను 2,30,825.96 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టింది. షెడ్యూల్ కులాల ప్రజల అభివృద్ధికి బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో 2021-22 బడ్జెట్‌లో ఎస్టీల కోసం ప్రత్యేకంగా ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్’ పథకాన్ని రూపొందించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించబోతుందన్నారు.షెడ్యూల్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పథకం కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. దాంతో పాటు ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్ల రూపాయలను హరీశ్ రావు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డా. బీ.ఆర. అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్పులను ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ అందుకున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించింది.
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తోన్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరీపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో రెండు గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతి జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఎస్టీ బాలుర కోసం న్యాయవిద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేయగా.. దళిత బాలికల కోసం ఎల్‌బీ నగర్‌లో మరో న్యాయవిద్య గురుకులాన్ని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment