విజయవాడ, న్యూస్‌లైన్ : ఆదిపరాశక్తి అయిన కనకదుర్గమ్మకు కళలంటే అమితమైన ఇష్టమని పురాణేతిహాసాలు తెలుపుతున్నాయి. ఇక ఆదిశంకరుడైన పరమేశ్వరుని నటరాజుగా కళాకారులందరూ కొలుస్తారు. అమ్మవారి సాన్నిద్ధ్యంలో తమ కళలను ప్రదర్శించడం అంటే కళాకారులు అదృష్టంగా భావిస్తారు. అటువంటి కళలపట్ల, కళాకారులపట్ల శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో ఇదే తంతు కొనసాగుతుంది.
రేపటినుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానుండగా ప్రదర్శన కోసం దరఖాస్తు చేసుకున్న కళాకారులకు ఇంత వరకు సమాచారం అందించలేదు. మరో ప్రాంతంలో కార్యక్రమాలను ఒప్పుకోవాలో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో కళాకారులున్నారు. దసరా మహోత్సవాల్లో తొమ్మిది రోజులపాటు వివిధ కళారూపాలను ప్రదర్శింపజేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులను అలరింపజేసేందుకు సంప్రదాయ నృత్యాలు, భక్తి రంజని, పౌరాణిక నాటిక, నాటక ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు, జానపద కళారూపాలను నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చేందుకు గానూ కళాకారులనుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. గత నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. గడువు ముగిసే నాటికి దాదాపు 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆయా దరఖాస్తులను ప్రాథమిక పరిశీలన చేసి ఎంపిక చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ బాధ్యతను చేపట్టిన సబ్ కలెక్టర్ 2వ తేదీన తొమ్మిది మందితో సెలెక్షన్ కమిటీ జాబితాను విడుదల చేసినట్లు తెలిసింది.
సెలక్షన్ కమిటీ జాబితా !
సేకరించిన సమాచారం మేరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను ఎంపిక చేసేందుకు ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, కూచిపూడి సిద్ధేంధ్ర కళాపీఠం అధ్యక్షులు పసుమర్తి కేశవప్రసాద్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు, దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్, పర్యాటక శాఖకు చెందిన రామలక్ష్మణ్, శంకరరావులతోపాటు దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులను నియమించినట్లు సమాచారం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు వచ్చిన ఒక వ్యక్తి మూడేళ్లుగా సెలక్షన్ కమిటీలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది కమిటీలోకూడా అతనికిస్థానం కల్పించడం విమర్శలకు దారితీస్తోంది.
త్రిశంకు స్వర్గంలో కళాకారులు :
అమ్మవారి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వటం అదృష్టంగా భావించే కళాకారులు ఆ అవకాశం కోసం ప్రతి ఏటా దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలు 5వతేదీనుంచి ప్రారంభం కానుండగా ఇంతవరకు వారి దరఖాస్తుల విషయమై ఎటువంటి సమాచారం లేకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ వంటి దూరప్రాంతాలనుంచి వచ్చే కళాకారులకు వారం రోజులు ముందుగా సమాచారం ఉంటే వారికి రైల్వే కన్సెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కొన్ని కార్యక్రమాలకు కావాల్సిన పక్క వాయిద్య కళాకారులు దొరికే అవకాశంకూడా లేకుండా పోతుంది.
ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కళాకారులకు పలు చోట్లనుంచి అవకాశాలొస్తుంటాయి. అమ్మవారి దేవస్థానం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఒప్పుకోవాలో లేదో అర్ధంకాక సతమతమవుతున్నారు. నగరంలోని శ్రీధర్మ పరిషత్ వంటి ప్రైవేట్ సంస్థ ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలతో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కావాల్సినంత సిబ్బంది ఉండీ సకాలంలో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేని దుస్థితిలో దేవస్థానం అధికారులు ఉండటం విశేషం. కాగా ఎంపికయిన కళాకారులు తమ ప్రదర్శనలిచ్చేందుకు వేదిక వద్దకు చేరుకోవాలన్నా కష్టంగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు.
కళావేదిక మార్పు :
కొన్ని సంవత్సరాలుగా మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ప్రదర్శనల వేదికను ఈ ఏడాది మండపం పక్కన మెట్ల మార్గం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. అక్కడ రేకుల షెడ్ నిర్మించి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులనుంచే నేల చదును చేయటం ప్రారంభించారు. గురువారం వరకుకూడా షెడ్ నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. రేకుల షెడ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వలన ప్రదర్శనల సమయంలో వర్షం వస్తే అది రేకులపైబడి శబ్ధం వస్తుంది. దీంతో కళాకారుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా పాత రేకులు వాడుతుండటం వలన కళా ప్రాంగణంలో వర్షపు నీళ్లు పడేఅవకాశం ఉంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మల్లికార్జున మహా మండపంలో ఈ ఏడాది లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు. అసలు ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా అన్నదికూడా ప్రశ్నార్థకంగా మారింది.
రేపటినుంచే దసరా ఉత్సవాలు ప్రారంభం
Published Fri, Oct 4 2013 1:26 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement