
పార్లమెంటులో వర్గీకరణపై ప్రశ్నిస్తాం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వర్గీకరణకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళన ఆదివారం 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. అణగారిన వ ర్గాల అభ్యున్నతి కోసమే అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను ఒక కులమే దోచుకోవడం అన్యాయమని, వర్గీకరించుకొని రిజర్వేషన్లను పంచుకోవాలని అన్నారు.
విభజన సమయంలో ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల అమలుకు సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు ఆ హామీని అమలు చేయాలన్నారు. స్వార్థపరులే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని.. అంబేడ్కర్ వాదులు వర్గీకరణకు సహకరిస్తారని మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు కె.కె.ప్రసాద్ మాట్లాడుతూ వర్గీకరణతోనే భవిష్యత్తు తరాలకు వెలుగు లభిస్తుందన్నారు.