యూపీఏ హయంలో ఎస్సీ వర్గీకరణకు తన వంతు కృషి చేశానని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అప్పుడు వర్గీకరణ సాధ్యం కాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన 17వ రోజు ఆందోళనలో మీరా కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని, వెనుకబాటు తనాన్ని గమనించి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించానని ఆమె పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని, అలా అందని పక్షంలో రిజర్వేషన్ల పంపిణీ ద్వారా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని భావించానన్నారు. వర్గీకరణను సమర్థించే విధంగా జాతీయ స్థాయిలో నియమించిన ఉషామెహ్ర కమిషన్ నివేదిక ఉందని పేర్కొన్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మీరా కుమార్ డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ప్రతిపక్షాల నుంచి.. జీఎస్టీకి మించిన మద్దతు లభిస్తుందని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆందోళనలో సఫాయి కర్మచారులు తదితరులు పాల్గొన్నారు.
వర్గీకర ణపై మీరా కుమార్‌ది ద్వంద్వ వైఖరి
ఎస్సీ వర్గీకరణ విషయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మాల మహానాడు మండిపడింది. బీహార్‌లో ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న మీరా కుమారీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్గీకరణకు మద్దతు ఇవ్వడమే అందుకు నిదర్శనమని సంఘం జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు.
మీరా కుమారి సొంత రాష్ట్రంలో మాత్రం దళితులు కలసి ఉండాలి.. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం విడిపోవాలా అన్ని ఆయన ప్రశ్నించారు. ఆధిపత్య కుల నేతలు దళితులను రాజకీయ చదరంగంలో కేవలం పావులుగా వాడుకుంటున్నారని మండిడ్డారు. అలాంటి వారి రాజకీయాలను చైతన్యంతో ఎదరుర్కొవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద మాలమహానాడు చేపట్టిన ఆందోళన గురువారం 15వ రోజుకు చేరుకుంది.