ఇంఫాల్‌లో ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు
ఇంఫాల్: మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లింది. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం గురువారం రంగంలోకి దించింది.
మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మైతీ వర్గం అధికంగా ఉన్న దక్షిణ ఇంఫాల్, కాక్‌చింగ్, థౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజన ప్రాబల్యం కలిగిన చురాచాంద్‌పూర్, కాంగ్‌పోక్పీ, తెంగౌన్‌పాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. చురాచాంద్‌పూర్, మంత్రిపుఖ్రీ, లాంఫెల్, కొయిరంగీ, సుగ్ను తదితర ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ జవాన్లు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.
సమస్మాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) సిబ్బంది మోహరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటిదాకా 9,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘర్షణలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ వలసల వల్లే..
మైతీలు ప్రధానంగా మణిపూర్ లోయలో నివసిస్తున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమకు ఎస్టీ హోదా కల్పించాలని వారు కోరుతున్నారు. వలసదారుల నుంచి గిరిజనులకు చట్టప్రకారం కొన్ని రక్షణలు ఉన్నాయి. మైతీలకు ఎస్టీ హోదాపై రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సును నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని గత నెలలో మణిపూర్ హైకోర్టు సూచించింది. దీనిపై గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అపార్థం వల్లే అనర్థం: సీఎం
రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అమాయకులు మృతి చెందడం, ఆస్తులు ధ్వంసం కావడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం అపార్థం వల్లే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు అన్ని చర్యలూ చేపట్టామని తెలిపారు. మణిపూర్‌లో హింసాకాండపై పొరుగు రాష్ట్రం మిజోరాం ముఖ్యమంత్రి జోరాంథాంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు.
గిరిజన సంఘీభావ యాత్ర
గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ఏటీఎస్‌యూఎం) ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా మైతీలకు, గిరిజనులకు నడుమ ఘర్షణ మొదలయ్యింది. రాత్రికల్లా తీవ్రస్థాయికి చేరింది. హింస చోటుచేసుకుంది. తొలుత చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదలైన ఘర్షణ, హింసాకాండ క్రమంగా రాష్ట్రమంతటికీ విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment