
కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందజేస్తున్న జిల్లా స్థాయి అధికారుల సంఘం
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : ‘మీరు ఉన్నతాధికారులైతే ఏంటి.. నాకు పెద్ద మొత్తంలో సమర్పించాల్సిందే. లేదంటే మీ అంతు చూస్తా. ఏసీబీకి పట్టించి నలుగురిలో నవ్వులపాలు చేస్తా. కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తా.’ ఇదీ ఏ రౌడీనో, గూండానో మామూళ్ల కోసం బెదిరింపులకు దిగుతున్న సందర్భం కాదు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ కుల సంఘానికి చెందిన నాయకుడు సాక్షాత్తూ జిల్లా ఉన్నతాధికారులే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న అంశం జిల్లాలో శుక్రవారం చర్చనీయాంశమైంది. తమపై బెదిరింపులకు పాల్ప డుతున్న మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ ఎస్ రత్నాకర్ వ్యవహార శైలిపై విసిగి వేసారిపోయిన 35 శాఖల అధికారులు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షురాలు, జేసీ–2 జి.రాజకుమారి ఆధ్వర్యంలో విషయాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయిం ఆస్మి వద్ద తమ గోడు వెళ్ల్లబోసుకున్నారు. వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని వినతి పత్రం సమర్పించారు.
వివరాల్లోకి వెళితే..
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్, అతడి అనుచరులు జిల్లా ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మధ్యలో వాహనం ఆపి చెప్పిందేం చేశారని ప్రశ్నిస్తారు. ఇస్తే ఓకే లేదంటే తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారని జిల్లా ఎïస్పీకి ఫిర్యాదు చేశారు. ‘‘నీ అంతు తేలుస్తాం’ అని బరితెగింపు వ్యవహారం నడుపుతారు. అక్కడికీ లొంగకపోతే మరో అడుగు ముందుకేసి కులం పేరుతో దూషించారని తప్పుడు కేసులు బనాయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కటికీ ఒప్పుకోని పక్షంలో ఉద్యోగులకు ఇబ్బందికరమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటి ప్రభావంతో అధికారులు మానసిక వేదనకు గురి కావాల్సివస్తోందని, ఇలాగేతే తాము ఉద్యోగాలు ఎలా చేయాలని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వేధింపుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని ఎస్పీ, కలెక్టర్‌ను కోరారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న రత్నాకర్‌పై చర్యలు తీసుకొని తమ విధులకు ఎలాంటి ఆటంకం, లేకుండా నిర్భయంగా నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని 35 శాఖలకు చెందిన అధికారులు ఎస్పీ నయీం అస్మీని కలిసి వివరించారు. దీనిపై ఎస్పీ నయీం అస్మీ స్పందిస్తూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా స్థాయి అధికారులందరూ కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని కలిసి రత్నాకర్ చేస్తున్న బెదిరింపులు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. అయితే కలెక్టర్ మురళీధర్‌రెడ్డిని కూడా కించపరుస్తూ, బెదిరింపులకు దిగుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్టు, దీనిపై కూడా చర్యలు చేపట్టాలని అధికారుల సంఘం కోరింది.
ఈ సందర్భంగా జెసీ–2 రాజకుమారి, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రత్నాకర్, అతడి అనుచరులపై ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి, ఐజీ, డీఐజీకి వినతి పత్రాలు పంపించామన్నారు. జిల్లాలోని అధికారులెవ్వరూ ఇలాంటి బెదిరింపులకు భయపడే అవసరం లేదన్నారు. వినతి పత్రాలు అందించిన వారిలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, పెద్దాపురం ఆర్డీవో ఎస్ మల్లిబాబు, డీఆర్‌డీఏ పీడీ మధుసూదనరావు, జెడ్పీ సీఈవో ఎం జ్యోతి, స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ సుఖజీవన్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత, పౌరసరఫరాల ఎండీ జయరాయలు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, పశుసంవర్థశాఖ జేడీ, తదితర శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment