సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది.
ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం
రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు.
అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్‌లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment