సాక్షి, వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం సద్దుమణగడం లేదు. కొన్ని కులాల ఉద్యోగులపై ఆయన వాడిన పదాలు మంటలు రేపుతున్నాయి. ఓసీ జేఏసీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటుండగా, నిన్నటి వరకు ఉమ్మడి వరంగల్‌కే పరిమితమైన ఆందోళనలు బుధవారం తెలంగాణలోని పలు జిల్లాలను తాకాయి. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వరకు వెళ్లగా, బుధవారం ఇచ్చిన పిలుపు మేరకు పరకాల బంద్ ప్రశాంతంగా జరిగింది. కాగా, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాల బాధ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. (వివాదాస్పద వ్యాఖ్యలపై ధర్మారెడ్డి క్షమాపణ)
శాంతించని సంఘాలు
వరుస వివాదాలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు వేదికలుగా మారాయి. పరకాలలో జరిగిన ఓ సమావేశంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరిట నిధుల సేకరణకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తొలుత వివాదాస్పదమయ్యాయి. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, విరాళాలు సేకరిస్తున్న నేతలే జేబులు నింపుకుంటున్నారని అన్నారు. దీనిపై భగ్గుమన్న బీజేపీ నేతలు హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం అట్టుడికిపోగా, హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలోనూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి మరో వివాదానికి తెరలేపారు. ‘ఆ కులాల అధికారులకు అక్షరం ముక్క రాదు’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఆఫీసుకు వెళ్లినా వాళ్లే ఉన్నతాధికారులుగా ఉన్నారు, ఇలాంటి వాళ్ల వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అనడంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఆందోళనలకు దిగారు.
‘సారీ’తో ఆగని ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ‘ఆ సమావేశంలో నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆ మాటలు ఎవరి మనసునైనా నొప్పించినట్లయితే వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెబుతున్నా’ అని అన్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దీంతో వివాదం ఇక సద్దుమణిగినట్లేనని అంతా భావించారు.
కానీ తమ మనోభావాలకు సంబంధించిన అంశంగా భావించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల, ఉద్యోగసంఘాలు ఆందోళనలను కొనసాగిçస్తున్నాయి. కాగా, రామమందిరం నిర్మాణంపై వ్యాఖ్యల వివాదం సమయంలో స్పందించిన టీఆర్‌ఎస్ వర్గాలు ఈ విషయంలో స్తబ్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా బీసీ, దళిత వర్గాల ఉద్యోగులను అవమానపరిచేలా పరకాల ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయంటూ జాతీయ బీసీ అధికార ప్రతినిధి దాసు సురేష్ మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ మార్చి 1వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment