
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాలు (ఎస్సీ)లకు చెందిన ఇంటి పెద్ద కరోనాతో మరణిస్తే.. ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు రుణంగా అందించనుంది. ఈ మొత్తంలో రూ.లక్ష సబ్సిడీ ఉంటుంది. మిగిలిన రూ.4 లక్షలను వాయిదాల్లో లబ్ధిదారులు చెల్లించాలి. ఈ మేరకు ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందించి భరోసా కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీ బి.నవ్య అన్ని జిల్లాలకు పంపారు. దరఖాస్తులు, లబ్ధిదారుల ఎంపిక, తదితర విషయాలపై ఆమె శనివారం అన్ని జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)లతో మాట్లాడారు.
అర్హతలివే..
► ఎస్సీ కుటుంబాలకు ఆధారమైన భార్యాభర్తల్లో ఎవరు కరోనాతో మరణించినా ఈ సాయానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
► 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉండాలి.
► ఏడాదికి రూ.3 లక్షల లోపు ఆదాయం మాత్రమే ఉండాలి.
► ఈ నెల 20లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జత చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి.
► ఈ దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయానికి పంపిస్తారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి ఈ నెల 20లోపు ఆయా జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయాలకు పంపాలి.
► జిల్లా కలెక్టర్‌లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు దరఖాస్తులు పరిశీలించి రాష్ట్ర స్థాయి అధికారుల తనిఖీకి పంపుతారు.
► అనంతరం లబ్ధిదారులకు రూ.5 లక్షల రుణాలు మంజూరు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment