చిత్తూరు : ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అత్యాచారం, ఆపై హత్యకు గురైన దళిత యువతి(18) కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు..పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువపూనేపల్లె దళితవాడకు చెందిన యువతి శనివారం గ్రామ సమీపంలో మేకలు మేపుతుండగా కొంత మంది దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారు. మృతిరాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కలవకుంటకు చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)ను సోమవారం అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే గ్యాంగ్ రేప్ జరిగినప్పటికీ పోలీసులు ఒక్కడిపైనే కేసు నమోదు చేయడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి చెందినవారని పోలీసుల విచారణలో తేలడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ స్థాయిలో జిల్లా పోలీసులపై ఒత్తిడి పెంచారు. పలువురిని తప్పించి ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో సిద్ధమైనట్లు సమాచారం.