పాట్నా: రిజర్వేషన్ల విషయంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి పెంచాలని ప్రాతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ వర్గాల వారి రిజర్వేషన్లు 55 శాతం ఉండగా తాజాగా వాటిని 65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) కేంద్రం నిర్దేశించిన 10శాతం రిజర్వేషన్లకు మినహయింపు. బిహార్ ప్రభుత్వం, కేంద్రం కల్పిస్తున్న రిజర్వేషన్లు కలిపి రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75శాతానికి చేరుకోనుంది.
దీనిపై నిపుణులతో సంప్రదింపుల తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ మార్పులు అమలు చేయాలనేది తమ ఉద్ధేశ్యమని తెలిపారు. అయితే ఓబీసీ మహిళలకు కేటాయించిన మూడు శాతం కోటాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
తాజా ప్రతిపాదనల ప్రకారం.. షెడ్యూల్డ్ కులాల వారికి 20శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కనుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలకు కలిపి 30 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుత ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్‌లు ఉన్నాయి.
చదవండి: బీహార్ కులగణన: 34 శాతం మంది పేదలే.. నెలకు రూ. 6 వేల కంటే తక్కువ ఆదాయం
కాగా కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఓబీసీ వర్గం వారిలో యాదవులు అత్యధిక సంఖ్యలలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో వారు 14. 27 శాతం ఉన్నారు. కులగణన ప్రకారం.. బిహార్ 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment