సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్
దోమ: చట్టం ముందు అందరూ సమానమేనని, కులాల పేరుతో గొడవలు తగవని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్ అన్నారు. మండల పరిఽధిలోని బ్రాహ్మణపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం విషయమై ఇటీవల ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు.
ముందుగా గ్రామంలోని ఆలయంలో పూజలు చేసిన అనంతరం స్థానికులతో సమావేశమై మాట్లాడారు. దేశంలో సామాజిక మార్పు కోసం ప్రజలను జాగృత పర్చాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలోనూ అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ఇలాంటి అసమానతలను తొలగించడానికి రాజకీయాలకు అతీతంగా జనాలను చైతన్యం చేయాలన్నారు.
బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావృతం కాకుండా నిఘా పెట్టాలని సూచించారు. ఘటనకు బాధ్యులపైన వారిపై 302 సెక్షన్ అమలు చేసి త్వరితగతిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన రోజే ఎస్‌ఐ విశ్వజన్ అప్రమత్తమై జిల్లా అధికారులతో కలసి బాధ్యులను గుర్తించి జైలుకు పంపడంపై ఎస్పీ కోటిరెడ్డి, ఎస్‌ఐని అభినందించారు.
సోదర భావంతో మెలగాలి
కులాలకు అతీతంగా ప్రజలంతా సోదరభావంతో కలసి మెలసి ఉండాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బడి, గుడి అందరివని కులాల ప్రస్తావన ఇక్కడ రావద్దని సూచించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘట నలు మళ్లీ రీపీట్ కాకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు.
పెద్దన్న పాత్ర పోషిస్తాం..
జిల్లాలో ఎలాంటి ఘటనలు జరిగినా పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన ఘటనపై వెంటనే స్పందించి బాధ్యులైన 35 మందిపై కేసు నమోదు చేసి, 20 మందిని రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి చెప్పాలన్నారు. అనంతరం బాధితులైన రఘురాం, అనసూయమ్మకు ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హాల్డర్, కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రూ.25 వేల చొప్పున పరిహారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, అడిషన్ ఎస్పీ మురళీధర్, తహసీల్దార్ షాహెదబేగం, డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, ఎంపీడీఓ జయరాం, ఆర్‌ఐలు లింగం, శివప్రసాద్, సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐలు గిరి, శ్రీశైలం, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు, ఎస్‌బీ సీఐ రామకృష్ణ, కానిస్టేబుల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment