► గ్రీన్ ట్రిబ్యునల్‌లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
► ఫిబ్రవరి 10న విచారణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగు న్నాయని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై) దృష్టికి తెచ్చింది. ఇప్పటికే పనుల అప్పగింత ప్రక్రియ పూర్తయిందని, పనులు నిలిపివేయాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వుల వల్ల ప్రాజెక్టు వ్యయాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్టును అడ్డుకు నేందుకు కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేసినా సానుకూల తీర్పులు రాలేదని వివరించింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాలని విన్నవించింది. అటవీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళ వారం కేఆర్ రావుతో కూడిన ట్రిబ్యునల్ విచా రణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనారెడ్డి వాదనలు వినిపించారు. కేసు విచారణకు వచ్చిన వెంటనే ప్రభుత్వం కౌంటర్‌ను ట్రిబ్యునల్‌కు సమర్పిం చింది. కౌంటర్‌లోని అంశాలను అధ్యయనం చేసి వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని, బుధవారం వాదనలు వినిపిస్తామ ని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ట్రిబ్యున ల్‌ను కోరారు.
అయితే బుధవారం తమకు సమయం లేనందున ఫిబ్రవరి 23న తిరిగి విచారణ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అంత గడువు వద్దని, వీలైనంత త్వరగా తిరిగి విచారణ చేయాలని పిటిషనర్లు కోరగా, ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. పాలమూరు పను లు అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయనే విష యం అటవీ అధికా రులు షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతే తమ దృష్టికి వచ్చిందని, దీంతో పనులను మరో చోటుకి మార్చాలని నిర్ణయించామని ప్రభుత్వం తన కౌంటర్‌లో తెలిపింది. ప్యాకేజీ 1, 2 పనులు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరగడం లేదని, ఈ ప్రాజెక్టు వల్ల వన్యప్రాణులకు ముప్పు లేదని స్పష్టం చేసింది. అటవీ ప్రాంతానికి వెలుపల పనులు చేస్తున్న నేపథ్యంలో పర్యావరణ చట్టం కింద ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది.
రోజుకు రూ.15 లక్షల ఫీజు
పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సుప్రీం కోర్టుకు చెందిన ముగ్గురు న్యాయవాదులను ప్రభుత్వం నియమించుకుంది. న్యాయవాది మోహన్ పరాశరణ్‌కు ఏకంగా ఒకరోజు హియరింగ్‌కు రూ.15 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించింది.