ఎన్జీటీ విధించిన జరిమానాపై స్టే  | Stay on penalty imposed by NGT | Sakshi
Sakshi News home page

ఎన్జీటీ విధించిన జరిమానాపై స్టే 

Published Sat, Feb 18 2023 3:28 AM | Last Updated on Sat, Feb 18 2023 4:23 PM

Stay on penalty imposed by NGT - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాగునీటికి సంబంధించి 7.15 టీఎంసీల పనులకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాలకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోందని పర్యావరణ అనుమతుల్లేవని ఆరోపించింది. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. 

► పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎన్జీటీ విధించిన భారీ జరిమానాను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముఖల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ .. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం తాగునీటి కోసమే ప్రాజెక్టు అని ఎలా చెబుతారు..? ఉత్తర్వుల్లో రెండు రకాల ప్రయోజనాలు అని ఉందిగా అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రాజెక్టు తాగు, సాగు నీటి విభాగాలకనీ, రెండింటికీ వేర్వురుగా నిధులు కేటాయింపులు ఉన్నాయని రోహత్గి తెలిపారు. 2050 నాటి అవసరాల మేరకు ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. తాగునీటి నిమిత్తం ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని దీంట్లో మొదటి రిజర్వాయరు 24వేల ఎకరాలని ఇది రాష్ట్రపతి భవనం కన్నా వెయ్యి రెట్లు పెద్దదని రోహత్గి తెలిపారు. వంద నుంచి రెండు వందల అడుగుల లోతుగా నిర్మిస్తున్న నిర్మాణాలు హఠాత్తుగా నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించిందన్నారు.

ప్రాజెక్టు పనులు సురక్షిత స్థాయికి తీసుకొచ్చి నిలిపివేయడానికే రూ.కోట్లలో ఖర్చయిందన్నారు. ఈలోగా ఆదేశాలు ఉల్లంఘించారంటూ ఎన్జీటీ భారీగా జరిమానా విధించిందని రోహత్గి తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల ఏపీలోని రాయలసీమ పర్యావరణంపై ప్రభావం ఎలా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు మరో సీనియర్‌ న్యాయవాది వైద్యనాధన్‌ ప్రశ్నించారు.

తెలంగాణ వారెవరూ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, ఏపీ వారే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, పర్యావరణ అనుమతుల్లేవంటూ ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర జల వివాదాలు లేపాలని యోచిస్తోందన్నారు.  

విభేదించిన ఏపీ న్యాయవాది 
న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని వినతి 
తెలంగాణ న్యాయవాదుల వాదనలతో ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది జయదీప్‌ గుప్తా విభేదించారు. రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీకి తెలంగాణ ఒప్పుకోలేదని తెలిపారు. ప్రాజెక్టు మొత్తంగా చూస్తే తాగునీరు అనేది చాలా చిన్న విషయమని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది.

తాగునీటి అవసరాలకు 7.15 టీఎంసీలు సరిపోతాయని సంయుక్త కమిటీ నివేదిక చెప్పిందని, అయితే సాగు, పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా 90 టీఎంసీలతో ప్రాజెక్టు రూపొందించారని జయదీప్‌ గుప్తా తెలిపారు. న్యాయస్థానం వాస్తవాల్లోకి వెళ్లాలని కోరారు. 7.15 టీఎంసీల పనులే చేపడుతున్నామని తెలంగాణ చెబుతోందిగా అని ధర్మాసనం పేర్కొనగా.. రిజర్వాయర్లకు అనుమతులు లేవని, ప్రాజెక్టు నిలిపివేయాలని గుప్తా కోరారు. ఎన్జీటీ ఎంత మొత్తం జరిమానా విధించిందని ధర్మాసనం ప్రశ్నించింది.

ఎన్జీటీ పాలమూరు–రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు జరిమానాగా విధించిందని రోహత్గి తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం వ్యయంరూ.35,200 కోట్లలో 1.5 శాతం రూ.528 కోట్లు ఆదేశాలు ఉల్లంఘించామంటూ మరో రూ.300 కోట్లు జరిమానా వేసిందన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. 7.15 టీఎంసీల తాగునీటి పనులకు మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొంది. తాగునీటి ఎద్దటితో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే అనుమతి ఇస్తున్నామని స్పష్టం చేసింది.

అనంతరం, ఎన్జీటీ విధించిన భారీ జరిమానాపై స్టే విధించాలని రోహత్గి కోరారు. ఎన్జీటీ విధించిన పరిహారం మొత్తంపైనా స్టే విధిస్తున్నట్లు పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆరువారాల్లోగా ప్రతివాదులు, ఏపీ ప్రభుత్వం, కేంద్రం కౌంటరు దాఖలు చేయాలని, తర్వాత ఆరు వారాల్లోగా తెలంగాణ రిజాయిండర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.  

పర్యావరణ అనమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపడుతోదంటూ ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన చందరమౌళీశ్వరరెడ్డి, తదితరులు ఎన్జీటీని ఆశ్రయించారు. పిటిషన్లు విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని 2021లో ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడుతోదంటూ పిటిషనర్లు మరోసారి ఎన్జీటీని ఆశ్రయించగా ఎన్జీటీ జరిమానా విధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement