ఇళయరాజాపై సోదరుడి ఫైర్
ఇళయరాజాపై ఆయన సోదరుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ ఫైర్ అయ్యారు. జాతీయ అవార్డును తిరస్కరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పలువురు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చర్యను చాలా మంది గర్హిస్తున్నారు. ఇళయరాజా 1000వ చిత్రం తారైతప్పటై చిత్ర నేపథ్య సంగీతానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వరించింది. అయితే దాన్ని ఆయన తన సంగీతానికి సరైన గుర్తింపు లభించలేదంటూ తిరస్కరించారు. ఈ విషయంలో ఇళయరాజా నిర్ణయాన్ని ఆయన సోదరుడు, జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుల్లో ఒకరైన గంగైఅమరన్ తీవ్రంగా ఖండించారు.
ఇళయరాజా చర్యను తప్పు పట్టారు. ఈ విషయంపై గంగైఅమరన్ స్పందిస్తూ ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే. అలాగని జాతీయ అవార్డును తిరస్కరంచడం సరైన చర్య కాదు.సంగీతంలో ఇద్దరికి అవార్డును అందించడంలో తప్పేమిటి? సంగీతానికి, పాటలకు ఒకరికే అవార్డు ప్రకటించాలనడంలో అర్థం లేదు. ఆస్కార్ అవార్డుల్లో ఇలాంటి విధానం లేదు. అయినా ఇప్పుడు ఒక్క ఇళయరాజా మినహా పాటలకు, నేపథ్యసంగీతానికి ఏ సంగీత దర్శకుడు అందిస్తున్నారు. ఒక్కో పాటకు ఒకరు సంగీతాన్ని అందిస్తున్న రోజులివి. అదే విధంగా పాత చింతకాయ పచ్చడిలా ఎప్పుడూ ఒకే తరహా సంగీతాన్ని అందిస్తే ఎలా? కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు. మన కాలం ముగిసిందన్న ఆలోచనకు రావాలి.
ఇప్పుటికీ తాను యువకుడినే అనే ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే.అలాంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నతమైన జాతీయ అవార్డును తిరస్కరించడం ఆయన అభిమానులైన తనలాంటి వారికి అసంతృప్తిని కలిగించే విషయం. ఒక వేళ ఆయనకు అవార్డు అందుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే తెలిపితే ఆయన చిత్రాలు పరిశీలించేటప్పుడు ఇళయరాజా అవార్డును స్వీకరించరు అని ఆ చిత్రాలను పక్కన పెడతాం. విచారణై చిత్రానికి జీవీ మంచి సంగీతాన్నే అందించారు.ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించి యువ సంగీతదర్శకులను ప్రోత్సహించే వారమని గంగైఅమరన్ తన సోదరుడు ఇళయరాజాపై విరుచుకుపడ్డారంటూ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది.