
సాక్షి, అమరావతి: వార్షిక కౌలు చెల్లింపు వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలన్న రాజధాని రైతుల అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం ముందు రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు బుధవారం ఈ అభ్యర్థన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించడంలేదని, దీనిపై తాము సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.
సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు నోటీసులు మాత్రమే జారీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము అప్పీల్ దాఖలు చేయాలని అనుకుంటున్నామని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయనప్పుడు దేనిపై అప్పీల్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తాము ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment