హైదరాబాద్: బాబొస్తే... జాబొస్తుంది... అంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. అంతేకాదు.. ఉద్యోగాలివ్వకపోతే నిరుద్యోగులందరికీ నెలకు రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సైతం హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక ఆ ఊసే మరిచారు. కొత్త రాజధానిలో భూముల సర్వేకోసం సర్వేయర్లు, ఉప సర్వేయర్ల పోస్టులు భర్తీ చేయాలంటూ రెవెన్యూశాఖ చేసిన ప్రతిపాదనలను సైతం సీఎం తిరస్కరించడం ఇందుకు నిదర్శనం. ఈ పోస్టుల భర్తీకి బదులుగా రాజధానిలో సర్వేను కూడా ప్రైవేట్‌పరం చేయాలని ఆయన సూచించడం గమనార్హం.
భర్తీ కుదరదు..
ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 4 వేల సర్వే పోస్టుల భర్తీకి అనుమతివ్వాలని రెవెన్యూశాఖ తొలుత ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆర్థికశాఖ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష సందర్భంగా సర్వేయర్ల కొరతపైన, ప్రస్తుతమున్న పని ఒత్తిడి తదితర అంశాలపైన రెవెన్యూ(సర్వే విభాగం)శాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నందున పోస్టుల భర్తీ సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 720 మంది సర్వేయర్లే పనిచేస్తున్నారని, 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెవెన్యూ అధికారులు వివరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. రిటైరైన వారికి శిక్షణనిచ్చి తీసుకోవాలని, లేదంటే ప్రైవేటు ఏజెన్సీలద్వారా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణనిచ్చి లెసైన్స్ సర్వేయర్లను నియమించుకోవాలన్నా ఒక్కొక్కరికీ శిక్షణకు రూ.40 వేలు అవుతుందని రెవెన్యూశాఖ తెలిపింది. ఆ మేరకైనా నిధుల మంజూరుకు సీఎం ససేమిరా అన్నారు. అంతేగాక రాజధానిలో సర్వే పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై అధికారులు మండి పడుతున్నారు. ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.
పాతబాటలోనే బాబు
సర్వేయర్, ఉప సర్వేయర్ జిల్లాస్థాయి పోస్టులే. రాష్ట్ర విభజన, రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులతో వీటికి సంబంధం లేదు. అయినా కొత్త పోస్టుల మంజూరు కన్నా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకే సీఎం చంద్రబాబు తిరస్కరించడం చూస్తుంటే.. సర్కారు పోస్టుల భర్తీకి భవిష్యత్‌లోనూ ఆయన ఇష్టపడరనే వాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు నాల్గోతరగతి పోస్టుల భర్తీపై నిషేధం విధించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
కేడర్ గ్రేడ్ ఖాళీలు సంఖ్య
జోనల్ గెజిటెడ్ 11,105
ఎన్‌జీవో 11,353
నాల్గోతరగతి 4
జిల్లా గ్రూప్-1 2
గెజిడెట్ 863
ఎన్‌జీవో 82,760
నాల్గోతరగతి 22,519
ఎయిడెడ్ 9,857
మొత్తం పోస్టులు ఖాళీ 1,38,463
కొలువుల భర్తీకి సీఎం తిరస్కరణ
Published Sat, Mar 7 2015 3:48 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement