న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా సుప్రీంకోర్టు తలుపులు అర్ధరాత్రి తెరుచుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు కోర్టు తలుపులు తీశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు చిట్టచివరి నిమిషంలో దాఖలు చేసిన పిటషన్ ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు అంగీకరించడంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 4వ నెంబరు కోర్టులో వాదనలు కొనసాగాయి.
అంతకుముందు బుధవారం సాయంత్రం మెమన్ పిటిషన్ ను కొట్టేసిన త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులనే ఈ పిటిషన్ విచారణకు కూడా చీఫ్ జస్టిస్ నియమించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం వద్ద రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయకూడదని మరో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెమన్ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మహారాష్ట్ర మాన్యువల్ ప్రకారం చూసినా కూడా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు, ఉరితీతకు మధ్య 7 రోజుల వ్యవధి ఉండాలని చెప్పారు.
అయితే, ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. షెడ్యూలు ప్రకారమే గురువారం నాడు మెమన్ ను ఉరి తీయాలని స్పష్టం చేసింది. దీంతో యాకుబ్ మెమన్కు ఉరికి ఖరారైంది.