నామినేషన్ రిజెక్టెడ్ | Filing of nominations on B Form | Sakshi
Sakshi News home page

నామినేషన్ రిజెక్టెడ్

Published Tue, Jan 19 2016 5:16 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM

నామినేషన్ రిజెక్టెడ్ - Sakshi

నామినేషన్ రిజెక్టెడ్

‘గ్రేటర్’లో భారీగా తిరస్కరణలు
సాక్షి, హైదరాబాద్: నిన్నటిదాకా టికెట్ల కోసం ఉరుకులు పరుగులు.. చేయని ప్రయత్నం లేదు.. వేడుకోని నాయకుడు లేడు.. ఇలా.. ఎన్నో కష్టనష్టాలకోర్చి నానాఅగచాట్లుపడి ఆయా పార్టీల నుంచి టికెట్లు పొందినప్పటికీ, స్క్రూటినీలో పలువురి నామినేషన్లను రిటర్నిం గ్ అధికారులు తిరస్కరించారు. ఇండిపెండెంట్లు, చిన్నాచితకా పార్టీల సంగతి అటుంచితే అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో కొందరికి ఓటరు జాబితాలో పేరే లేకపోగా, మరికొందరికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కారణంగా ఆయా నామినేషన్లను తిరస్కరించారు.

ఇంకొందరిని ప్రతిపాదించిన వారు స్థానికేతరులు కావడంతో తిరస్కరించారు. కడపటి సమాచారం మేరకు 127 వార్డులకు చెందిన 3,138 నామినేషన్లలో 114 తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఇండిపెండెంట్లతో పాటు వివిధ పార్టీల వారు ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకులు తమ పార్టీ తరఫున కొత్త అభ్యర్థి కోసం వేటలో పడ్డారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో అర్హత పొందిన వారు ఎక్కడెక్కడున్నారో వెతికి తమ పార్టీ బీఫారం ఇవ్వాలని యోచిస్తున్నారు.
 
తిరస్కరణల్లో కొన్ని..
జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి శేఖర్ యాదవ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి బొజ్జ జయరాజ్ తిరస్కరించారు. ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నట్లు మాజీ కార్పొరేటర్ కె.జగన్ ఫిర్యాదు మేరకు, న్యాయనిపుణుల సలహాతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిపారు.
ముగ్గురు సంతానం ఫిర్యాదుతోనే కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంపూర్ణ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ తిరస్కరించారు. ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి పిల్లల జననాలకు సంబంధించి అఫిడవిట్ అందజేయాల్సిందిగా సంపూర్ణకు సూచించారు.
ఒక కాన్పులో కవలలు, మరో కాన్పులో మరొకరు జన్మించినట్లు అఫిడవిట్ అందజేయడంతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.  
వివేకానందనగర్ కాలనీ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం స్వాతి పేరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో లేకపోవడంతో తిరస్కరించారు.
ఇద్దరికి మించి సంతానం ఉన్న కారణంగా తలాబ్‌చంచలం డివిజన్ ఎంబీటీ అభ్యర్థి ఖదీర్ ఉన్నీసా బేగం నామినేషన్‌ను తిరస్కరించారు. ఇదే డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రేణుకేశ్వణి నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉండటం, ప్రతిపాదించినవారు లేకపోవడంతో తిరస్కరించారు.

రామ్నాస్‌పురా డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి హర్షద్‌పాషా, టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఫారూఖ్‌అలీ, మహ్మద్‌హజీలను ప్రతిపాదించిన వారు స్థానిక వార్డులో ఓటర్లు కాకపోవడంతో తిరస్కరించారు. ఇదే కారణంతో కిషన్‌బాగ్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్వాక్ అహ్మద్ దరఖాస్తును తిరస్కరించారు.
ఉప్పుగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి రియాజ్ పేరు జీహెచ్‌ఎంసీ ఓటరు జాబితాలో లేకపోవడంతో తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement