
ప్రకటనలో దాపరికమెందుకు?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయినా అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో బీజేపీ ఉండటంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
జాబితా వెల్లడించకపోవడంపై బీజేపీ నేతల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్లు పూర్తయినా అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో బీజేపీ ఉండటంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతోపాటు దేశంలోని 10 రాష్ట్రాలకు పైగా ముఖ్యమంత్రులున్న బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఈ ఎన్నికల్లో అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటిదాకా ఏ పార్టీ, ఏ నాయకుడూ అనుసరించని విధంగా నామినేషన్లు పూర్తయినా పార్టీ అభ్యర్థులను అధికారికంగా ఖరారుచేయకపోవడంపై పలువురు రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణాలేమిటో, ప్రకటిస్తే వచ్చే నష్టమేమిటో, ఈ దాపరికానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో పార్టీ సీనియర్లకు అంతుచిక్కడం లేదు. రాజకీయ పార్టీగా ఎన్నికలకు సమాయత్తం కావడానికి మించిన కార్యక్రమాలు ఏమున్నాయో అర్థం కావడం లేదని వారంటున్నారు.
సమన్వయ లోపమే: రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్లలో సమన్వయలోపమే ఈ దుస్థితికి కారణమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. బండారు దత్తాత్రేయ, జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్.రామచందర్‌రావు, వెంకట రెడ్డి వంటి నేతలు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీతో జరిగిన చర్చల్లో వీరిలో ఒకరిద్దరు మినహా ముఖ్యపాత్రను పోషించా రు. టీడీపీకి 87, బీజేపీకి 63 సీట్లు గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీచేయడానికి నిర్ణయించుకున్నాయి. అయితే పార్టీలో అంతర్గతంగా జరిగి న ఘటనలు, తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని సీనియర్లలో పట్టుదల, ఏ ఇద్దరు సీనియర్ల మధ్య సమన్వయం లేకపోవడం వంటివాటితో నామినేషన్లకు గడువు ముగిసిపోయినా అభ్యర్థులను ప్రకటించలేదు.
పార్టీలో విశాల ప్రయోజనాలను పట్టించుకోకుండా, ఒకరిద్దరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుండటం వల్ల శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతింటోందని ఆదివారం రాత్రి రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఇలా అయితే అభ్యర్థులు ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తారని, టికెట్లు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తే చివరి క్షణంలో ఎలా చల్లబరుస్తారని వారు అంటున్నారు. ఈ పరిణామాలపై జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో పార్టీని రక్షించాలని అధినాయకత్వాన్ని కోరారు.