‘రాష్ట్రపతి’ రేసులో రాజకీయ వేడి
సమావేశమైన విపక్షాలు.. అభ్యర్థిపై తేలని చర్చలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్లు ప్రారంభం కావటంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల క్యాంపుల్లో రాజకీయ వేడి రాజుకుంది. తమ అభ్యర్థిని బరిలో దించేం దుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ విపక్షాలతో కమిటీ ఏర్పాటుచేసుకుని చర్చలు జరుపుతోంది. బుధవారం సమావేశమైన విపక్ష పార్టీల కమిటీ అభ్యర్థిపై తేల్చలేదు. అటు, ముగ్గురు కేంద్ర మంత్రుల (రాజ్‌నాథ్, జైట్లీ, వెంకయ్య)తో బీజేపీ ఏర్పాటుచేసిన బృందం ఎన్డీయే పక్షాలతోపాటుగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలతో చర్చిస్తోంది. ఈ త్రిసభ్య బృందం శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతోనూ చర్చించనుంది.
బీజేపీ అభ్యర్థిని ప్రకటించాకే..
బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో సమావేశమైన విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు. ‘అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోలేం’ అని ఆజాద్ వెల్ల డించారు. ఒకవేళ బీజేపీ బలమైన హిందుత్వ మూలాలున్న వ్యక్తిని బరిలోకి దించితే.. విపక్షాల అభ్యర్థిని బరిలోకి దించటం ఖాయమని జేడీయూ నేత శరద్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నిక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించింది మాత్రమే కాదని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు జరుగుతున్న ప్రయత్నమని లాలూ ప్రసాద్ సమావేశం అనంతరం వెల్లడించారు. గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తదితరుల పేర్లు విపక్ష అభ్యర్థులుగా వినిపిస్తున్నాయి.
మోదీ పర్యటనకు ముందే..
జూన్ 25న అమెరికా పర్యటనకు ప్రధాని బయలుదేరేముందే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌తోనూ వెంకయ్య మాట్లాడారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, మిగతా నేతలతో మాట్లాడుతున్నారు. కాగా, బుధవారం రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది,
ఎన్డీయే అభ్యర్థి సుష్మ?
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్ సన్నిహిత వర్గాల ప్రకారం సుష్మ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ‘రాష్ట్రపతి అభ్యర్థి కోసం మాకు సరిపోయేంత మెజారిటీ ఉంది. అయితే సంఘ్ పరివార్ అభ్యర్థే ఈ స్థానంలో ఉండే అవకాశం కోల్పోకూడదని భావిస్తున్నాం. దీనికి సుష్మాస్వరాజ్ వంటి చురుకైన రాజకీయవేత్త సరైన అభ్యర్థి’ అని బీజేపీ కీలకనేత చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. సుష్మ అభ్యర్థిత్వాన్ని మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి వ్యక్తులు కూడా వ్యతిరేకించకపోవచ్చని సమాచారం.