వారిమధ్య 'క్విడ్ ప్రో కో' జరిగింది
న్యూఢిల్లీ: లలిత్ మోడీ బ్రిటన్ నుంచి ప్రయాణ పత్రాలు(ట్రావెల్ డాక్యుమెంట్స్- టీడీ) పొందేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆమెపై విరుచుకుపడింది. వారిద్దరి మధ్య 'క్విడ్ ప్రో కో' జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసింది. సుష్మా స్వరాజ్ తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పీఎల్ పునియా ఈ అంశంపై మాట్లాడుతూ దాదాపు 700 కోట్ల రూపాయల కుంభకోణంలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా సహాయం చేస్తారని ప్రశ్నించారు. అతడిపై అప్పటికే అపరాధ నోటీసులు ఉన్నప్పటికీ 24గంటల్లోనే అన్ని రకాల సదుపాయాలు కల్పించారని ఆరోపించారు. ఆమె అనధికారికంగా లలిత్ మోడీకి సహాయం అందించారని ఆరోపించారు. వెంటనే అతడిని వెనుకకు రప్పించి తగిన విధంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.