ప్రధాని ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌లో ఐదో సభ్యుడిగా సీనియర్ న్యాయవాది పీపీ రావు పేరును ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దేశ ప్రజలు 40 ఏళ్ల నుంచి లోక్‌పాల్ కోసం ఎదురుచూస్తున్నారని, ఆ నియామకాలపై వారికి నమ్మకం కలిగించాలని చెప్పారు. సభ్యుల ఎంపిక ఏకగ్రీవమయ్యేందుకు రాష్ట్రపతి జోక్యాన్ని కోరతానని తెలిపారు. ఐదో సభ్యుడి ఎంపిక విషయంలో మరింత సమయం కావాలని, పలువురి అభ్యర్థనలను పరిశీలించాలని కోరారు. అనుకూలవర్గంతో లోక్‌పాల్‌ను నింపకూడదన్నారు.
పరాశరన్‌ను నియమించండి...
అయితే లోక్‌పాల్ ప్యానల్‌లోని ప్రఖ్యాత న్యాయకోవిదుడు విభాగపు నియామక అంశంపై ప్రధాని నివాసంలో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో కూడా ప్రధాని ప్రతిపాదనతో సుష్మ విభేదించారని సమాచారం. పీపీ రావు కాంగ్రెస్‌కు అనుకూలురని, ప్యానల్‌లో అలాంటి వారికి చోటు ఇవ్వవద్దంటూ వాదించారని తెలిసింది. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తుల్ని నియమించాలని డిమాండ్ చేశారని, పీపీ రావు స్థానంలో మాజీ అటార్నీ జనరల్ కె. పరాశరన్‌కు చోటివ్వాలని కోరారని సుష్మ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఎంపిక కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులు ప్రధాని మన్మోహన్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు.. పీపీ రావుకు మద్దతు తెలిపినట్లు ఆ వర్గాలు చెప్పాయి. లోక్‌పాల్‌లోని ఎనిమిది మంది సభ్యులకు నామినేషన్ పక్రియ శుక్రవారంతో ముగుస్తుంది.