రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమవ్వాలి..!
సంఖ్యాబలం ఉన్నప్పుడు పోటీ పెట్టడమే తప్పు
- మేం సంపూర్ణ మద్దతు ఇస్తాం
- జైల్లో పెట్టినా.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాం
- బీజేపీకి తగినంత బలం ఉంది.. మేమూ మద్దతిస్తాం
- హోదా, భూసేకరణ విషయంలో మాత్రం బీజేపీని వ్యతిరేకిస్తున్నాం
- ఢిల్లీలో విలేకరులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉన్నప్పుడు పోటీ పెట్టడమే తప్పని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. ‘ఎలాగూ బీజేపీ అభ్యర్థే గెలుస్తారు కాబట్టి ప్రత్యేకంగా ప్రతిపక్షాలు అభ్యర్థిని పెట్టడంలో ఔచిత్యం లేదంటున్నాం ప్రత్యేకహోదా విష యంలోనూ, భూసేకరణ విషయంలోనూ బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకు మంచి చేసే విషయంలో మాత్రమే ప్రభుత్వా నికి మద్దతు పలుకుతున్నాం’ అని వ్యాఖ్యానిం చారు. అనంతరం ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు..
మీడియాః రాష్ట్రపతి ఎన్నికలపై ఏమైనా చర్చ జరిగిందా?
జగన్ః రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరైనా పోటీ పెట్టాలని ఆలోచన చేస్తే అది తప్పు. వాళ్లు ఎలాగూ గెలుస్తారు. వాళ్ల దగ్గర ఎలాగూ సంఖ్యాబలం ఉంది. బీజేపీ ఎవరినైతే అభ్యర్థిని పెడుతుందో వారు ఎలాగూ గెలుస్తారు. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారు ఇంకో అభ్యర్థిని పెట్టడంలో ఔచిత్యం ఏముంది? అర్థం ఏముంది?
మీడియాః పోటీ పెట్టడంపై సోనియాగాంధీ అన్ని పార్టీలతో చర్చ జరుపుతున్నారు కదా?
జగన్ః సోనియాగాంధీ రాజకీయంగా ఏం ఆలోచన చేస్తారో నాకు తెలియదు గానీ, అలాంటి పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన సందేశం పంపినవాళ్లమవు తామన్నది అందరూ ఆలోచన చేయాలి. దానిపై పెద్దగా చర్చ జరగాలి.. దానిని వ్యతిరేకించాలి అన్న ఆలోచన ఏదీ లేదు.
మీడియాః ప్రధాన మంత్రి వద్ద ఏదైనా ప్రస్తావన వచ్చిందా?
జగన్ః రాష్ట్రపతి ఎన్నికల్లో వారు పెట్టే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రధాన మంత్రి గారికి చెప్పాం. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మాటల సంద ర్భంలో వాళ్లు తప్పనిసరిగా ప్రస్తావిస్తారు. మద్దతు కూడా ఇస్తాం. ఎలాగూ వాళ్లు పెట్టిన వ్యక్తే గెలుస్తారు. ఆ పదవికి పోటీ పెట్టడం కూడా తప్పే అని గట్టిగా నమ్ముతున్నాం. బీజేపీకి సంబంధించినంతవరకు మేం అన్ని వేళలా మద్దతు ఇచ్చాం. వారితో మాకు ఎప్పుడైనా వ్యతిరేకత ఉందీ అంటే ప్రత్యేక హోదా విషయంలో, భూసేకరణ బిల్లు విషయంలో మాత్రమే. అంటే ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి విషయంలో అధికార పార్టీకి తోడుగా నిలిచాం. ఉంటాం కూడా. ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు విషయంలోనే మేం బీజేపీని వ్యతిరేకించాం.
మీడియాః దేశవ్యాప్తంగా ‘ఒకేసారి ఎన్నికలు’ విషయంపై ఏమంటారు?
జగన్ః జరిగితే మంచిది..
మీడియాః రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మీకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం, మీరు కలవడం వెనుక ఏదైనా ప్రాధాన్యత ఉందా?
జగన్ః నాకు తెలిసినంతవరకు రాష్ట్రపతి ఎన్నిక ఉంది కాబట్టి ఒకరికి అపాయింట్‌మెంటు ఇస్తారు లేదంటే లేదు అని అనుకోవడం సరికాదు.
మీడియాః మీ ఫిర్యాదులపై స్పందన ఎలా ఉంది?
జగన్ః ఫిర్యాదులపై సానుకూ లంగా స్పందిం చారు. బాగా సానుకూలంగా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే... ప్రజాస్వామ్యంలో మనం చేయాల్సింది... వాళ్ల వాళ్ల పనులు గుర్తుచేయాలి. వాళ్ల వాళ్ల బాధ్యతలు మరిచిపోకుండా ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తెచ్చే క్రమంలో ఏమేం చేయాలో అవన్నీ కచ్చితంగా చేస్తాం..
మీడియాః రైతుదీక్ష తదితర అంశాలపై తెలుగుదేశం మీపై విమర్శలు చేయడాన్ని ఏమంటారు?
జగన్ః వాళ్లకు పనీపాటా లేదు. చంద్రబాబు ప్రధాన మంత్రిని వచ్చి కలిసి అడగాలి. మిర్చి రైతులు అన్యాయం అవుతున్నారు. మిర్చి రైతులే కాకుండా మామిడి, కంది, మినుము, పసుపు సహా 19 రకాల పంటలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో వ్యవసాయం కుదేలవుతోంది. చంద్రబాబు ఇక్కడికి వచ్చి అంతో ఇంతో కేంద్రం నుంచి సహాయం అడగాలి. ఆ సహాయానికి తోడు రాష్ట్రం నుంచి సహాయం అందించాలి. వాళ్లు రారు. అడగరు. పట్టించుకోరు. స్థిరీకరణ నిధి పెట్టి ఆదుకోవాల్సింది పోయి పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇక్కడ ఎండలు ఉన్నాయని.. చల్లగా ఉంటుందని అమెరికా వెళ్లిపోయారు..
మీడియాః రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ప్రస్తావించారా?
జగన్ః రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇంత అవినీతి ఏ రాష్ట్రంలో కూడా లేదు. చంద్రబాబు పాలనపై ఇంతకుముందే ఒక పుస్తకం ప్రధానికి పోస్టు ద్వారా పంపాం. ఇప్పుడు స్వయంగా ఇచ్చాం..
మీడియాః కాంగ్రెస్ పార్టీ సీట్ల పెంపు బిల్లు విషయంలో ఒక షరతు పెట్టింది. హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటోంది. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎలా మద్దతు ఇస్తారు?
జగన్ః నన్ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసినప్పుడు మేం మద్దతు ఇవ్వలేదా? ప్రత్యేక హోదా ఇవ్వగలిగింది ప్రధాన మంత్రి. ప్రధానిపై అటువంటప్పుడు ఎంత ఒత్తిడి అయినా తెస్తాం. మేం చంద్రబాబు మాదిరిగా అనైతిక రాజకీయాలు చేయం. స్ట్రెయిట్‌గా చేస్తాం. ప్రత్యేక హోదా అంటూ ఎవరిస్తారో వారికి మద్దతు ఇస్తాం అన్నాం. కట్టుబడి ఉంటాం. ప్రత్యేక హోదా అన్నది లేకుండా కేంద్రంలో చంద్రబాబు మాదిరిగా జతకట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు.
మెట్రోలో జగన్ ప్రయాణం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు బుధవారం ఉదయం ఢిల్లీ వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి మెట్రో రైలు ద్వారా చేరుకున్నారు. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డిలతో పాటుగా ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్ నుంచి శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణం చేసి తదుపరి రోడ్డు మార్గంలో ప్రధాని నివాసానికి చేరుకున్నారు.