3 నుంచి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారత ఐటీ నిపుణులు, కంపెనీలు ఎదురుచూసే హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసుల సంస్థ(యూఎస్‌సీఐఎస్) తెలిపింది.
అయితే దరఖాస్తులను ఎప్పటివరకు స్వీకరిస్తారో చెప్పలేదు. గత సంవత్సరాల్లో యూఎస్‌సీఐఎస్ ఈ గడువును పేర్కొనేది. సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ మొదలైన తేదీ నుంచి ఐదు పనిదినాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2017 ఆక్టోబర్ 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించారు.
అమెరికా కాంగ్రెస్ విధించిన 85 వేల హెచ్1బీ వీసాల మంజూరుకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరాల్లో వచ్చాయి. 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ వారికి, 20 వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనేది నిబంధన. పరిశోధన కోసం అమెరికాకు వచ్చేవారికి ఇచ్చే వీసాలు ఈ పరిమితిలోకి రావు.
అయితే త్వరగా వీసా ఇచ్చేందుకు సంబంధించిన ప్రీమియం వీసా ప్రక్రియను ఆరు నెలలు రద్దు చేయడంతో వీరి వీసా ప్రక్రియకు విఘాతం కలిగింది. దరఖాస్తు(ఫామ్ ఐ–129) ఫీజును కూడా 460 డాలర్లకు పెంచారు.