Immigration service
-
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
హెచ్–1బీ వీసాలకు దరఖాస్తుల వెల్లువ
వాషింగ్టన్: హెచ్–1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఈ వీసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, హెచ్–1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ప్రతిఏటా కేవలం 65 వేల హెచ్–1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలను అందజేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే లెక్కలు మిక్కిలి దరఖాస్తులు వచ్చాయని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. త్వరలో కంప్యూటర్ ఆధారిత డ్రా ద్వారా హెచ్–1బీ వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు అమెరికా పౌరసత్వ చట్టం–2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టం కింద గ్రీన్ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితిని రద్దు చేయనున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణులు భారీగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అమెరికాలో వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం పెట్టుకున్న పిటిషన్లు గత పదేళ్లుగా పెండింగ్లోనే పడి ఉన్నాయి. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే వీసా ఫీజులతోపాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆరోగ్య సేవల సర్చార్జి భారీగా పెరగనుంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జి (ఐహెచ్ఎస్) ఏడాదికి 400 పౌండ్లు (రూ.38 వేలు) మాత్రమే ఉండగా.. తాజా బడ్జెట్ ప్రకారం ఇది 624 పౌండ్లు (సుమారు రూ.60 వేలు)కు చేరుకోనుంది. వలసదారులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే రుసుము పెంచుతున్నట్లు రిషి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ 470 (రూ.45 వేలు) పౌండ్లుగా ఉండనుంది. -
3 నుంచి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారత ఐటీ నిపుణులు, కంపెనీలు ఎదురుచూసే హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసుల సంస్థ(యూఎస్సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తులను ఎప్పటివరకు స్వీకరిస్తారో చెప్పలేదు. గత సంవత్సరాల్లో యూఎస్సీఐఎస్ ఈ గడువును పేర్కొనేది. సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ మొదలైన తేదీ నుంచి ఐదు పనిదినాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2017 ఆక్టోబర్ 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించారు. అమెరికా కాంగ్రెస్ విధించిన 85 వేల హెచ్1బీ వీసాల మంజూరుకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరాల్లో వచ్చాయి. 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ వారికి, 20 వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనేది నిబంధన. పరిశోధన కోసం అమెరికాకు వచ్చేవారికి ఇచ్చే వీసాలు ఈ పరిమితిలోకి రావు. అయితే త్వరగా వీసా ఇచ్చేందుకు సంబంధించిన ప్రీమియం వీసా ప్రక్రియను ఆరు నెలలు రద్దు చేయడంతో వీరి వీసా ప్రక్రియకు విఘాతం కలిగింది. దరఖాస్తు(ఫామ్ ఐ–129) ఫీజును కూడా 460 డాలర్లకు పెంచారు.