స్వాప్నికులకు పీడకలేనా!
చిన్నప్పుడే అమెరికా వచ్చిన వలసదారులపై నేడు ట్రంప్ నిర్ణయం
► ఆందోళనలో 8 లక్షల మంది యువత
►వీరిలో 7 వేల మంది భారతీయులు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస దారులు, శరణార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది గంటల్లో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువతను అక్రమ వలసదారులుగా గుర్తించే అంశంపై నేడు నిర్ణయం వెలువరించే అవకాశముంది. వీరిని అమెరికాలో డ్రీమర్లు (స్వాప్నికులు)గా పిలుస్తారు. ట్రంప్ తీసుకునే నిర్ణయం తో 8 లక్షల మంది కలల సౌధాలు కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు కూడా ఉన్నారు.
అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని, వారిపై దయ చూపాలే తప్ప శిక్షించరాదనే అభిప్రాయంతో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తుల్ని ఆమోదించారు. వీరు ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఆ వర్క్ పర్మిట్ల రద్దుపైనే ట్రంప్ నేడు ప్రకటన చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ
అధికారంలోకి రాగానే డీఏసీఏను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీనిచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను రద్దు చేసి, వారిని స్వదేశాలకు పంపాలని రెండేళ్ల క్రితమే డిమాండ్ మొదలైంది. డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధికి ప్రమాదమని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. ఈ వలసదారుల్లో ఎక్కువమంది పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారే. భారత్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం వరకూ ఉండొచ్చని అంచనా.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు
ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారికి తెలియని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీల నేతలు వాదిస్తున్నారు. డీఏసీఏ రద్దును ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ 300 మంది టెక్, బిజినెస్ దిగ్గజాలు ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు.
పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా రద్దును వద్దని కోరుతున్నారు. కాగా ఒబామా హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని మంగళవారంలోగా రద్దు చేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు హెచ్చరించాయి. దీంతో సందిగ్ధంలో పడ్డ ట్రంప్ వర్క్ పర్మిట్ల పథకాన్ని వెంటనే రద్దుచేయకుండా ఆరు నెలలు యధాతథ స్థితి కొనసాగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్