సమస్యలకు నిలయమైన ఎస్సీ బాలికల గురుకులం ఇదే..
సాక్షి, ఇల్లెందుఅర్బన్: పట్టణంలోని 24 ఏరియాలో ఉన్న బాలికల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. చాలీచాలని గదుల్లో విద్యార్థినులు కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేదు. నిరుపయోగంగా ఉన్న సివిల్ కార్యాలయం భవనాన్ని గురుకులానికి అప్పజెప్పారు. పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు సుమారు 320మంది ఉన్నారు. ఈ భవనంలో 18 గదులు ఉండగా వీటిల్లో 8గదుల్లో విద్యార్థినులకు విద్యాబోధన కొనసాగుతోంది. మిగిలిన గదుల్లో బస చేయడానికి వినియోగిస్తున్నారు.
అరకొర గదుల వల్ల వరండాలోనే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కో గదుల్లో సుమారు 40మందికి పైగా విద్యార్థినులు నిద్రిస్తున్నారు. పాఠశాలకు సింగరేణి నీరే దిక్కు. ఈ నీరు నెలలో ఐదారు రోజులు వరుసగా నిలిచిపోవుతుండటంతో విద్యార్థినుల బాధలు వర్ణనాతీతం. వేసవి కాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది.
ఆటస్థలం కరువు..
విద్యార్థినులకు ఆటస్థలం లేకుండాపోయింది. పాఠశాలకు సమీపంలో ఉన్న సింగరేణి ఆటస్థలాన్ని అప్పుడప్పుడు వినియోగించుకుంటున్నారు. సంపూర్తిగా ఆటస్థలం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు క్రీడలకు దూరమవుతున్నారు. క్రీడల్లో రాణించే సత్తా ఉన్న విద్యార్థినులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
పక్కాభవనం నిర్మాణానికి మంజూరు కాని నిధులు..
ఎస్సీ బాలికల గురుకులం పాఠశాలకు పక్కా భవనం నిర్మించేందుకు ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనే.. సుమారు 8 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ నిర్మాణాకి నిధులు మంజూరు కాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా భవనం నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థినులకు వసతులు కొదువుగా ఉన్నాయి..
ఎస్సీ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు సరిపడా గదులు లేకపోవడంతో కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పక్కా భవనానికి స్థలం కేటాయించారు. కాని నిధులు మంజూరు కాకపోవడంతో నిర్మాణం జాప్యమవుతోంది. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో.. ఓ ఇంజనీరింగ్ భవనాకి గురుకులాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం.
-ఎస్‌కె.పాషా, గురుకులం ప్రిన్సిపాల్, ఇల్లెందు
Comments
Please login to add a commentAdd a comment