ఈ వెండి సంతోషానివ్వదు... | There Are Many Causes Of hair Whitening | Sakshi
Sakshi News home page

ఈ వెండి సంతోషానివ్వదు...

Published Thu, Oct 24 2019 2:34 AM | Last Updated on Thu, Oct 24 2019 2:34 AM

There Are Many Causes Of hair Whitening - Sakshi

సాధారణంగా వెండి రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ కనువిందు చేస్తుంది. కానీ ఈ వెండి రంగు మాత్రం సంతోషాన్నివ్వదు. పైగా బాధను నింపుతుంది. మరికొందరిలోనైతే... ‘‘అప్పుడేనా?... ఈ వయసులోనేనా...?’’ అనే ఫీలింగ్‌ ఇస్తుంది. అవే వెంట్రుకలు తెల్లబడటం. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం అనేది చాలా సహజమైన ప్రక్రియ. ఏజింగ్‌లో భాగంగా అందరిలోనూ జరిగే ప్రక్రియే. అయితే కొందరిలో అది చాలా చిన్న వయసులోనే జరుగుతుంది. అలా నెరవడాన్ని ‘బాలనెరుపు’ అంటారు. ఇలా బాలనెరుపు వచ్చేందుకు కారణాలేమిటో, వాటి నివారణ ఎలాగో తెలుసుకుందాం.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణమిదే...
మన వెంట్రుకల మూలాన్ని మనం హెయిర్‌ ఫాలికిల్‌ అని పిలుస్తాం. ఈ మూలంలో మెలనోసైట్స్‌ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్‌ అనే కణాలు మెలనిన్‌ అనే రంగునిచ్చే పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. అప్పుడప్పుడే తెల్లబడుతున్న వెంట్రుకలను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌ కింద పరిశీలించినప్పుడు అక్కడి మెలనోసోమ్స్‌ అనే చోట్ల తగినంత మెలనిన్‌ ఉండకపోవడాన్ని డాక్టర్లు గమనిస్తారు. అదే తెల్లవెంట్రుకల విషయానికి వస్తే అక్కడ మెలనోసైట్స్‌ అనే కణాలు ఉండవు. ఈ పిగ్మెంట్‌ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది.

కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్‌ ఉత్పత్తి ఆగిపోవడం ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుందన్నమాట. వాస్తవానికి మనకు 50 ఏళ్ల వయసు వచ్చేనాటికి మన జుట్టుకు రంగునిచ్చే 50 శాతం పిగ్మెంట్‌ను కోల్పోతాం. కానీ కొందరిలో ఆ వయసుకు ముందే జుట్టు తెల్లబడుతుంది.నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్‌ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్‌లుసెంట్‌)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంటుంది.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు
వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అన్నింటికంటే  ప్రధానమైన కారణాలు జన్యుపరమైనవి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. ఇలా కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లబడటానికి మరికొన్ని కారణాలు ఇవే...

స్వాభావికంగా వెంట్రుకలు నల్లబడాలంటే...
►ఐరన్, జింక్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. 
►విటమిన్‌ బి–12 పుష్కలంగా అందేలా తగిన ఆహారం తీసుకోవడం వల్ల వెంట్రుకల నెరుపు తగ్గుతుంది. మాంసాహారులైతే మాంసం, శాకాహారులైతే రోజూ గ్లాసెడు పాలు తాగడంతో పాటు, పొట్టుతీయని తృణధాన్యాలు తినాలి. ఇవి తీసుకున్న తర్వాత కూడా మీ ఒంటికి సరైన మోతాదులో విటమిన్‌ బి12 అందకపోతే డాక్టర్‌ సలహా మేరకు వైటమిన్‌ బి12 అందేలా టాబ్లెట్లు వాడటం అవసరం. ∙ క్యాల్షియం పాంటోథనేట్, పాబా అమైన్‌ సప్లిమెంట్లు తీసుకుంటే తెల్లవెంట్రుకలు తగ్గే అవకాశం ఉంది.
►కరివేపాకు వేసిన మజ్జిగ వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడే ప్రక్రియ మందగిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
►ఇక వాతావరణ కాలుష్యాలకు సైతం వీలైనంత దూరంగా ఉంటూ మంచి స్వాభావికమైన వాతావరణంలో ఉండాలి.
►వ్యాయామం కూడా వెంట్రుకలు నెరిసే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతో పాటు ఓవరాల్‌ హెల్త్‌కూ మంచిది.

చికిత్స:  హెయిర్‌ పెప్‌టైడ్‌ సీరమ్‌ వంటి కొన్ని మందులను వాడితే ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని తప్పనిసరిగా డాక్టర్‌ సలహా మేరకే వాడాలని గుర్తుంచుకోవాలి.

మానసిక ఒత్తిడి కారణంగా...
►మనలో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల మన జీవకణాల్లోని కొన్ని పొరలు (సెల్యులార్‌ స్ట్రక్చరల్‌ మెంబ్రేన్స్‌), కొవ్వుపదార్థాలు (లైపిడ్స్‌), ప్రోటీన్లు, డీఎన్‌ఏ దెబ్బతిని వెంట్రుక తెల్లబడుతుంది.
►తీవ్రమైన మానసిక ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్, ఇన్‌ఫ్లమేటరీ స్ట్రెస్‌)
►కణంలోని రోగనిరోధక శక్తి తగ్గడం
►థైరాయిడ్‌ లోపం
►రక్తహీనత (అనీమియా)
►పొగతాగే అలవాటు
►హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉత్పత్తి (మన రోమమూలాల్లో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కూడా ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు కూడా వెంట్రుక తెల్లబడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది).
►వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణమవుతాయి.

కొన్ని మూలకాల/పోషకాల లోపాలు
►ఐరన్‌ లోపించడం
►కాపర్‌ లోపించడం
►జింక్‌ లోపించడం
►విటమిన్‌ బి–12, విటమిన్‌–ఈ, విటమిన్‌–సి లోపించడం
డాక్టర్‌ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement