నెలసరి... సమస్యలిక సరి | Monthly issue is correct to yoga | Sakshi
Sakshi News home page

నెలసరి... సమస్యలిక సరి

Published Thu, Aug 17 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

నెలసరి... సమస్యలిక సరి

నెలసరి... సమస్యలిక సరి

మహిళల్లో క్రమ రహిత ఋతుచక్రం ఇప్పుడు సర్వసాధారణం. ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువు ఉండడం, ఒబేసిటీ,  అనెరెక్సియా (బరువు పెరుగుతామనే భయంతో తక్కువగా తినడం) మానసిక ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, పిసిఒడి... వంటì వన్నీ కారణాలే. యోగలో దీనికి చక్కని పరిష్కారాలున్నాయి.

ఋతుక్రమ సమస్య రజస్వల అయిన 5 సంవత్సరాల వరకూ, మెనోపాజ్‌కి 3 సంవత్సరాల ముందు ఎక్కువగా బాధిస్తుంటుంది. ఈ అవస్థ నుంచి బయటపడడానికి విటమిన్‌డి, కాల్షియం సప్లిమెంట్స్, సోయా, ఫ్లాక్స్‌ సీడ్‌ (అవిసెగింజలు) వాడడం, హెర్బల్‌ మెడిసిన్స్‌ వాడవచ్చు. వీటన్నింటికన్నా  క్రమం తప్పని యోగ సాధన ఎంతైనా ఉపయుక్తం. నిలబడి చేసే ఆసనాల్లో తాలాసన, తాడాసన,  త్రికోణాసన, పార్శ్వకోణాసన, కూర్చుని చేసే వాటిలో వక్రాసన, మరీచాసన, భరద్వాజాసన, ఉష్ట్రాసన, అర్ధ ఉష్ట్రాసన, అథోముఖ శ్వానాసన, బద్ధ కోణాసన, బోర్లాపడుకుని చేసే వాటిలో భుజంగాసన, ధనురాసన వంటివి ఉపకరిస్తాయి. వీటిని సాధన చేస్తే పునరుత్పత్తి వ్యవస్థ బాగా ప్రభావితమై సమస్య పరిష్కారమవుతుంది. 
 

1 భరద్వాజాసనం
కాళ్లు రెండూ ఎడమవైపు మడిచి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ శరీరానికి కుడివైపు నేలమీద ఉంచి తలను, ఛాతీని, నడుమును, వెనుకకు పూర్తిగా తిప్పుతూ 2,3 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ తల, ఛాతీ మధ్యలోకి తీసుకురావలెను. ఇదే విధంగా వ్యతిరేక దిశలో చేయవలెను. ఈ ఆసనాన్ని 3 లేదా 5 సార్లు రిపీట్‌ చేయవచ్చు.

2 పరివృత్త పార్శ్వకోణాసనం
సమస్థితిలో నిలబడాలి. కుడికాలు ముందుకి ఎడమ కాలు వెనుకకి (కాళ్ళ మధ్యలో 3 లేదా 4 అడుగుల దూరం) ఉంచాలి. కుడి మోకాలు ముందుకు వంచి ఎడమ కాలిని వెనుకకు బాగా స్ట్రెచ్‌ చేయాలి, నడుమును ట్విస్ట్‌ చేస్తూ ఛాతీని కుడివైపుకి తిప్పి, ఛాతీని తొడభాగానికి నొక్కుతూ ఎడమ ఆర్మ్‌పిట్‌ (చంకభాగం) కుడి మోకాలు మీదకు సపోర్టుగా ఉంచి వెనుకకు చూస్తూ రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచాలి. కొంచెం సౌకర్యంగా ఉండటానికి ఎడమ మడమను పైకి లేపి పాదాన్ని, కాలి వేళ్ళను ముందు వైపుకి తిప్పవచ్చు. 3 లేదా 5 శ్వాసలు తరువాత తిరిగి వెనుకకు వచ్చి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. నమస్కార ముద్రలో చేతులు ఉంచలేని వాళ్లు ఎడమ అరచేతిని పూర్తిగా నేలమీద ఉంచి కుడిచేతిని కుడి చెవికి ఆనించి ముందుకు స్ట్రెచ్‌ చేస్తూ కుడి అరచేతిని చూసే ప్రయత్నం చేయవచ్చు.

3 అర్ధ ఉష్ట్రాసనం
వజ్రాసనంలో... అంటే మోకాళ్లు మడిచి మడమలు పాదాల మీద (మోకాళ్లు రెండింటి మధ్య ఒక అడుగు దూరం ఉంటే సౌకర్యంగా ఉంటుంది) కూర్చోవాలి. అవసరం అయితే మడమల కింద ఒక దిండును ఉపయోగించండి. ఎడమ అరచేయి ఎడమ పాదం వెనుకగా భూమి మీద ఉంచి చేతిని నేలకు ప్రెస్‌ చేస్తూ సీట్‌ భాగాన్ని పైకి లేపుతూ కుడి చేయిని ముందు నుండి పైకి తీసుకు వెళ్లి శ్వాస తీసుకున్న స్థితిలో శరీరాన్ని విల్లులాగా వెనుకకు వంచుతూ పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయాలి. (ఎడమ అరచేయి భూమిమీద సపోర్ట్‌గా ఉంచినట్టయితే వెన్నెముకకు డ్యామేజ్‌ జరగదు). శ్వాస వదులుతూ తిరిగి వజ్రాసనంలోకి రావాలి. అదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. అనుభవం ఉన్న సాధకులు ఎడమ అరచేతిని ఎడమ పాదం మీద ఉంచి పొట్టను ముందుకు నెట్టే ప్రయత్నం చేయవచ్చు.

4 యోగ కాయ చికిత్స
పైన చెప్పిన ఆసనాలతో పాటు యోగ కాయ చికిత్స కూడా మంచి ఫలితాన్నిçస్తుంది. న్యూరాన్‌ ట్రాన్స్‌మిషన్‌ చానెల్స్‌కి సంబంధించిన బయోఫీడ్‌ మెకానిజంతో పనిచేయడమే ఈ యోగ కాయ చికిత్స. ఈ చికిత్సను 21 లేదా 40 రోజులు గాని క్రమం తప్పకుండా చేస్తే పిసిఒడి సమస్య, పొట్టలో లేదా ఛాతీలో ఏర్పడిన గడ్డలు (ఫైబ్రాయిడ్స్‌) కరిగిపోతాయి.

చేసే విధానం
పొట్ట మీద గడియారం దిశలో కొంచెం మీడియం సైజ్‌ సర్కిల్‌లో మృదువుగా అరచేతితో మర్దన చేయాలి. పొత్తికడుపు కింది భాగం నుంచి పైకి బొడ్డు భాగం వరకూ అప్‌వార్డ్‌ దిశలో... బొడ్డు భాగం నుంచి పక్కలకు పై నుంచి కిందకు డయాగ్నల్‌గా రోజూ 20 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం మర్దన చేయాలి. ప్రాణయామాలు, తేలికపాటి ఆసనాలు తప్ప పొట్ట మీద ఒత్తిడి కలిగించే ఆసనాలు పీరియడ్స్‌ టైమ్‌లో చేయకూడదు.

5 ధనురాసనం
నేలపై బోర్లాపడుకుని మోకాళ్ళని వంచి చేతుల్ని  వెనక్కి తీసుకెళ్ళి కాలి చీలమండల్ని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ రెండు కాళ్ళని, ఛాతీని పైకెత్తాలి. పొట్ట మాత్రమే నేలను తాకుతూ ఉంటుంది. శరీరం బరువు మొత్తం పొట్ట మీద ఉంటుంది. శరీరం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ముందు కాళ్ళను పైకెత్తుతూ, ఛాతీని పైకెత్తితే నడుము మీద ఒత్తిడి పడదు. కాళ్ళను పైకెత్తే క్రమంలో మోకా ళ్ళను ఎడంగా ఉంచాలి. అప్పుడు ఆసనంలోకి వెళ్ళటం తేలిక అవుతుంది. సాధ్యమైనంత సేపు ఆసనంలో ఉండి నెమ్మదిగా ఛాతీ నేలకు ఆనించి తర్వాత కాళ్ళను నేలకు ఆనించి నిదానంగా బయటకు రావాలి.
- ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

– సమన్వయం: ఎస్‌. సత్యబాబు,
ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement