
మత్తు వదిలిస్తున్నారు!
తాగి వాహనం నడిపితే జైలుకే
జిల్లాలో 6 నెలల్లో 10,546 కేసులు
రూ.40,62,800 జరిమానా
సరదాకోసం కొందరు.. వ్యక్తిగత సమస్యలతో మరికొందరు.. మానసిక ఒత్తిడితో ఇంకొందరు ఇలా కారణాలు ఏవైనా వాటి నుంచి ఉపసమనం పొందేందుకు మద్యానికి బానిసలవుతున్నారు. పుట్టుగా మద్యంసేవించి ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు జిల్లా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానా, శిక్షలు విధిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 10 వేలకుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ. 40 లక్షల 60 వేల వరకు జరిమానా విధించారు.
తిరుపతిక్రైం: మద్యంమత్తులో వాహనాలు నడిపే వారికి జిల్లా పోలీసులు ఝలక్ ఇస్తున్నారు. దొరికినవారికి దొరికినట్లు.. జరిమానా విధిస్తున్నారు. తీవ్రత ఎక్కువగా ఉంటే.. జైలుశిక్ష కూడా తప్పడం లేదు. జిల్లాలో 25కు పైగా బ్రీత్ అన్‌లైజర్లు ఉన్నాయి. వీటితో రాత్రిపూట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు మరి న్ని బ్రీత్ అన్‌లైజర్లు వచ్చే అవకాశం ఉంది. అవి వచ్చిన వెంటనే తనిఖీలు మరింత విస్తృతం చేయనున్నారు.
శ్వాస పరీక్షలు, శిక్షలు..
తనిఖీల సమయంలో పోలీసులు వాహనదారుని నోట్లో బ్రీత్ అన్‌లైజర్ పెట్టి గట్టిగా ఊదమంటారు. ఆ వ్యక్తి మద్యం సేవించినట్టు అయితే బ్రీత్ అన్‌లైజర్‌లో ఆల్కాహా ల్ శాతం నమోదవుతుంది. ఒక బీరు, 15 ఎంఎల్ మద్యం సేవించినట్లు అయితే 30 శాతంగా చూపిస్తుంది. అంతకు మించి నమోదైదే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తారు. పరీక్షించిన సమయంలో శరీరంలోని ఆల్కాహాల్ శాతం వివరాలు, బ్రీత్ అన్‌లైజర్ నుంచి వచ్చే రశీదులో నమోదవుతాయి. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు తరలిస్తారు. న్యాయమూర్తి ఇచ్చే తీర్పును బట్టి రూ.2 వేల వరకు జరిమానా వరకు లేదా జైలు శిక్షపడే అవకాశం ఉంది.
నిబంధనలు ఇలా..
ద్విచక్ర వాహనదారుడు రూ.2 వేలు జరిమానా, పదేపదే దొరికితే రూ.5 వేలు జరిమానాతో పాటు ఆరునెలలు జైలు విక్ష విధిస్తారు.
కారు, అంతకన్నా పెద్దవాహనాలు నడుపుతూ చిక్కిన వారికి రూ.2500 జరిమానా, మూడు రోజులు జైలు శిక్ష, పదేపదే దొరికితే జైలు శిక్షతోపాటు జరిమానా కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
తిరుపతి అర్బన్ జిల్లాలో..
2014లో 1336 కేసులు నమోదు కాగా, రూ.40,68,000 కోర్టులో జరిమానాలు విధించారు.
2015లో 1755 కేసులు నమోదు కాగా రూ.61,93,400 జరిమానాలు కోర్టు ద్వారా విధించారు.
2015లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి సుమారు రెండు నెలలు పాటు జైలు శిక్షపడింది. మరో వ్యక్తికి లెసైన్స్ లేనందున మూడు రోజులపాటు జైలు శిక్ష విధించారు.
2016 జూలై వరకు రూ.23,62,800 ఇప్పటి వరకు మద్యం తాగిన వారి వద్ద జరిమానాలను కోర్టు వసూలు చేసింది.
చిత్తూరులో కేసులు ఇలా..
2014లో 1470 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.49,71,200 జరిమానాల రూపంలో వసూలు చేశారు.
2015లో 1272 కేసులు నమోదు కాగా కోర్టు ద్వారా రూ.37,72,100లు వసూలు చేశారు.
2016లో జూలై వరకు సుమారు 400లకు పైగా కేసులు నమోదు చేసి రూ.17 లక్షలకు పైగా కోర్టు ద్వారా జరిమానాలు విధించారు.
జరిమానా మా లక్ష్యం కాదు..
వాహనదారులకు జరిమా నా విధించడం మా లక్ష్యం కాదు. మద్యంసేవించి వాహనాలు నడపడం వల్ల నిండుప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. వాటిని అరికట్టడమే ముఖ్యం. మద్యం సేవించి వాహనాలు నడిపితే గతంలో జరిమానాలు విధించేవారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుం డా మద్యం సేవించి, ట్రిపుల్ రైడింగ్‌లో కాలేజీ విద్యార్థులు ఎవరైనా దొరికితే వారి వద్ద మొదటిసారిగా 3 గంటలసేపు ట్రాఫిక్ విధులు నిర్వహింపజేస్తాం. రెండోసారి దొరికితే మూడు రోజులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ ఓ.దిలీప్‌కిరణ్, ట్రాఫిక్ డీఎస్పీ, తిరుపతి