ఆ విషయంలో... వయసును బట్టే వాయిదా!
కౌన్సెలింగ్
సంతానం కలగక ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలుష్యం, ఒత్తిడి, ఆహారపుటలవాట్లు... కారణమేదైతేనేం అనేకమంది మాతృత్వానికి నోచుకోలేకపోతున్నారు. పిల్లలు కలగకపోవడం ఒక సమస్య అయితే ఆ సమస్య కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు.
పెళ్ళయ్యాక చాలామంది దంపతులు ముందుగా వారు ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. అలా చేయడం మంచిదే కాని మీ వయసును దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మూడేళ్ళు...నాలుగేళ్ళు అంటూ నియమం పెట్టుకునే మందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ముప్ఫై ఏళ్ళు దాటాక పిల్లలు కనడం మహిళల విషయంలో మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.
చాలామంది దంపతుల విషయంలో డాక్టర్లు ఏ లోపమూ లేదని చెబుతారు. ఇంకొంత కాలం ఎదురు చూడమంటారు. ఈలోగా ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు దంపతుల్ని అనవసరపు ఒత్తిడికీ, ఆందోళనకూ గురి చేస్తుంటాయి. మాటిమాటికీ పిల్లల తలంపు ఎత్తడం వల్ల ఏర్పడే ఒత్తిడి దాంపత్య జీవితంపై చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
ఇటు పుట్టింటివారు, అటు అత్తింటి వారు మాటిమాటికి అమ్మాయినే అడగడం, తోటివారితో పోల్చడం వల్ల మానసికంగా కుంగిపోతున్న మహిళలు చాలా మంది ఉన్నారు. దంపతులిద్దరూ పెద్దవాళ్ళకు నిర్మొహమాటంగా తమ ప్లానింగ్ గురించి చెప్పేయడం ఉత్తమం. ఒకవేళ డాక్టర్లు లోపం ఉందని చెబితే దాని గురించి కూడా వివరంగా చెప్పి, మీ భవిష్యత్ ప్రణాళిక గురించి ముందుగా మీరే చెబితే వారు కూడా ప్రశాంతంగా ఉంటారు.
పిల్లలు పుట్టకపోవడానికి లోపం దంపతులిద్దరిలో ఉంటుంది. మహిళలకు లోపం ఉంటే ఆ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తారు. అదే అబ్బాయికి ఏదైనా సమస్య ఉంటే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల భార్య అనవసరపు అభాండాలకు గురవుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మగవాళ్ళు అవసరమైన చికిత్సకు ముందుకెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి.
ఎంత వైద్యం చేయించుకున్నా ప్రయోజనం లేకపోతే అనవసరపు బెంగలు పెట్టుకోకుండా దత్తత మార్గాన్ని ఎంచుకోవడంలో తప్పు లేదు. ఏళ్ళ తరబడి పిల్లల కోసం ఎదురుచూస్తూ, వైద్యం పేరుతో ఆరోగ్యం పాడుచేసుకునే బదులు ఓ బిడ్డను పెంచుకుని ప్రశాంతంగా ఉండొచ్చు.
- డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పటల్