విధుల్లో ఉరిమే ఉత్సాహం కావాలంటే!
ఆరోగ్యవంతుడి మదిలోనే సృజనాత్మక ఆలోచనలు, అద్భుతమైన ఆవిష్కరణలు రూపుదాలుస్తాయి. కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు తరచుగా అలసటకు లోనవుతుంటారు. నిస్సత్తువ, నిరుత్సాహం ఆవరిస్తుంటాయి. దీంతో పనితీరు, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటాయి. క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, పనిలో విసుగుదల, తగినంత నిద్ర లేకపోవడం.. ఇలాంటి ప్రతికూల కారణాలతోనే ఉద్యోగులు కార్యాలయంలో అలసటకు లోనవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. జీవన శైలి(లైఫ్ స్టైల్)లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఉత్సాహం పుంజుకోవచ్చని సూచిస్తున్నారు.
నడకే నయం: ఆఫీస్‌లో సహచరులతో సంభాషించాలంటే చాట్ మెసెంజర్, ఈ-మెయిల్, సెల్‌ఫోన్ వంటివి ఉపయోగించకుండా... వారి దగ్గరకు నడిచి వెళ్లండి. లిఫ్ట్ వాడకుండా మీరుండే అంతస్తు దాకా మెట్లదారినే ఎంచుకోండి. మీ వాహనాన్ని ఆఫీస్‌కు కొంత దూరంలోనే నిలిపేసి కాళ్లకు పని చెప్పండి. వినడానికి ఇవన్నీ చాలా చిన్న విషయాలుగానే కనిపిస్తాయి. కానీ, ఇవి చూపే ప్రభావం మాత్రం అసామాన్యం. నడక వల్ల శరీరంలో క్యాలరీలు కరిగిపోతాయి. మీరు వేసే ప్రతి అడుగు మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. బద్ధకాన్ని దూరంగా తరిమికొడుతుంది.
భోజనం.. ఎన్నిసార్లు?: మనం సాధారణంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తాం. ఒకరోజులో మొత్తం మూడు సార్లు తింటాం. దీన్ని ఆరు నుంచి ఎనిమిది భాగాలుగా విడగొట్టండి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటే జీర్ణాశయంపై ఒత్తిడి తగ్గి, దాని పనితీరు మెరుగవుతుంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై, శక్తి సమకూరుతుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకోసారి కొద్ది మొత్తంలో తినండి. అలాగే తీసుకొనే ఆహారం తాజాగా, అందులో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వచ్చే ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
ఫాస్ట్‌ను బ్రేక్ చేయాల్సిందే!: కొందరు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతారు. రాత్రి పడకపై చేరినప్పటి నుంచి ఉదయం లేచేదాకా ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి శరీరం శక్తిని కోల్పోతుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన గంటలోపే అల్పాహారం తప్పనిసరిగా తినాలి. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అవసరం.
కంటినిండా నిద్ర : తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు త్వరగా అలసిపోతారు. క్రమంగా బరువు కూడా పెరుగుతారు. నిద్ర సరిపోకపోతే శరీరంలో కీలక హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. శరీరానికి ఆహారం అవసరం లేకపోయినా ఆకలిగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ తింటారు. కాబట్టి రోజూ కనీసం ఆరు నుంచి ఏడు గంటలపాటు కంటినిండా నిద్ర పోవాలి.
వ్యాయామం మర్చిపోవద్దు : ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి తీరిక దొరక్కపోతే కనీసం వారాంతాల్లోనైనా అందుకు సమయం కేటాయించండి. ఫిట్‌నెస్ కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడండి. జాగింగ్, రన్నింగ్ చేయండి. ఆసక్తి ఉంటే డ్యాన్స్ కూడా చేయొచ్చు. యోగాతో తీరైన శరీరాకృతి, ఆరోగ్యం సొంతమవుతాయి. మనసుంటే మార్గాలుంటాయి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం కష్టమేమీ కాదు. ఆరోగ్యానికి మించిన విలువైన ఆస్తి మరొకటి లేదు.