లూపస్‌  అంటువ్యాధా? ఎందుకు  వస్తుంది?  | Rheumatoid arthritis is an Autoimmune disease | Sakshi
Sakshi News home page

లూపస్‌  అంటువ్యాధా? ఎందుకు  వస్తుంది? 

Published Wed, Apr 17 2019 2:28 AM | Last Updated on Wed, Apr 17 2019 2:28 AM

Rheumatoid arthritis is an Autoimmune disease - Sakshi

మా పక్కింటావిడకి లూపస్‌ వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆవిడ తరచూ నా దగ్గరకు వస్తుంటుంది. దీనివల్ల నాకు కూడా ఆ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అసలు లూపస్‌ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ జబ్బు ఎందుకు వస్తుంది? 

లూపస్‌ లేదా ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్‌ లూపస్‌ అరిథమెటోసిస్‌) అనే ఈ వ్యాధి ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తి రోగిపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. మనందరిలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. జన్యులోపాల వంటి ఏవైనా కారణాల వల్ల మన వ్యాధి నిరోధక శక్తి... మన శత్రుకణాలను తుదముట్టించడానికి బదులుగా, మన సొంతకణాలనే మన శత్రువులుగా పరిగణించి, వాటిపై దాడి చేస్తుంది. దాంతో కంచే చేను మేసినట్టుగా మన సొంత అవయవాలే మన వ్యాధి నిరోధకశక్తి బారిన పడతాయి. అందువల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఒకరి నుంచి 15 మంది వరకు ఈ జబ్బు వస్తుంటుంది. సాధారణంగా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు.

ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఇది అంటుకోదు. కాబట్టి ఈ జబ్బు ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం వల్ల, సహజీవనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకదు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను వెలివేయనక్కర్లేదు. పైపెచ్చు వారి పట్ల మరింత ప్రేమ, ఆదరణ చూపించడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుంది. అలా వ్యాధి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే రోగిలో కూడా తరచూ లక్షణాలు మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే వ్యాధి ఉండవచ్చు. మరికొన్నిసార్లు చాలా తీవ్రరూపంలో లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ రోగులు సూర్యరశ్మికి అతి సున్నితంగా ఉంటారు. ఎండబారిన పడ్డప్పుడు ఒంటిమీద ర్యాష్, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి.

వివిధ రకాలైన మచ్చలు, దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నోటిలో పూత, జుట్టు ఎక్కువగా రాలడం, కీళ్లనొప్పుల వంటివి ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత వల్ల కొందరిలో ఒక్కోసారి యుక్తవయసులోనే పక్షవాతం, గుండెపోటు, బుద్ధిమందగించడం వంటి విపరీత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపుపోవడం, తరచూ ఫిట్స్‌రావడం, రక్తహీనత, తెల్లరక్తకణాలు–ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం కూడా సంభవించవచ్చు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద పొర ఏర్పడి, చుట్టూ నీరు చేరడం కూడా జరగవచ్చు. మహిళల్లో తరచూ గర్భస్రావాలు జరగడానికి కూడా లూపస్‌ ఒక కారణం.

ఈ వ్యాధి ప్రభావం మూత్రపిండాలపై పడినప్పుడు ఒళ్లంతా వాపు, బీపీ పెరగడం, మూత్రం నుంచి ఎక్కువగా ప్రోటీన్‌ పోవడం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఏ అవయవమైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. పై అవయవాలు ప్రభావితం అయినప్పుడు... వాటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్‌ వాడినా ప్రయోజనం ఉండక, స్టెరాయిడ్స్‌ అనే మందులు వాడినప్పుడు ఉపశమనం కలుగుతుంటే... లూపస్‌ వ్యాధిని గుర్తించడానికి అది మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఇలాంటి రోగులను వెంటనే రుమటాలజిస్టులకు చూపించాలి. వ్యాధి నిర్ధారణ చేసి, వారి ఆధ్వర్యంలో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. 

ఆర్థరైటిస్‌ రోగుల ఆహారం ఎలా ఉండాలి? 

నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్‌) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్‌ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి. 

కీళ్లవాతం (ఆర్థరైటిస్‌) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. 

నిజానికి గౌట్‌ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప... వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్‌ అనే వ్యాధిలో యూరిక్‌ యాసిడ్‌ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్‌ యాసిడ్‌ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్‌ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్‌ వంటి పదార్థాలను తినకూడదు.

అలాగే మద్యం వల్ల కూడా యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్‌ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతోపాటు క్యాల్షియమ్‌ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్‌ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది. 

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు స్టెరాయిడ్స్‌ తప్పవా? 

నా వయసు 52 ఏళ్లు. నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. నొప్పి, వాపు తగ్గడం కోసం ప్రిడ్నిసలోన్‌ అనే మందును చాలా కాలం నుంచీ వాడుతున్నాను. రెండేళ్ల నుంచి నొప్పి పెరిగింది. ప్రతి నెలా స్టెరాయిడ్‌ ఇంజెక్షన్స్‌ ఉపయోగిస్తున్నాను. నెల కిందట నా ఎడమ కాలు ఎముక విరిగి, ఇంట్లో పనులు చేసుకోడానికి ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్‌ కాకుండా మెరుగైన చికిత్స ఏదైనా ఉందా? 

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే మన ఒంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన కణాలనే గుర్తించే సమర్థతను కోల్పోయి మన శరీర అవయవాలపైనే దాడి చేస్తుంది. దాంతో ఈ వ్యాధి వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను ప్రారంభించాలి. నిపుణులు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్‌ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వీటిని దీర్ఘకాలం వాడితే చాలా రకాల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి షుగర్, నొప్పి, ఎముకలు బలహీనంగా కావడం... దాంతో తేలిగ్గా విరిగిపోవడం, కంటి శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటివి ముఖ్యమైనవి.

కాబట్టి చికిత్స చేసే డాక్టర్లు స్టెరాయిడ్‌ స్పేరింగ్‌ డ్రగ్స్‌ మందులను ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ జరగగానే వీటిని ఉపయోగించాలి. వీటితో పాటు చిన్న చిన్న మోతాదుల్లోనే స్టెరాయిడ్స్‌ను మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ స్టెరాయిడ్‌ స్పేరింగ్‌ మందుల వల్ల వ్యాధి తీవ్రతను, తీవ్రమైన వ్యాధి వల్ల కలిగే నొప్పి, వాపు, క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. ఇటీవల అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని బయొలాజిక్స్‌ అంటారు. తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. త్వరగా స్టెరాయిడ్స్‌ వాడకాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. 

డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి సీనియర్‌ రుమటాలజిస్ట్, 
సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం. 12,బంజారాహిల్స్, హైదరాబాద్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement