Steroid
-
సినెర్‌కు శిక్ష లేదా!
వాషింగ్టన్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ)ని పెద్ద వివాదం చుట్టుముట్టింది. అతను రెండుసార్లు స్టెరాయిడ్ పరీక్షల్లో విఫలమైనా ఎందుకు చర్య తీసుకోవడం లేదంటూ ఇతర ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. సినెర్‌ను పోటీల్లో ఇంకా ఎలా ఆడనిస్తున్నారని ప్రశ్నించిన వారు... అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని విమర్శించారు. ఈ ఏడాది మార్చిలో నిషేధిత అనబాలిక్ ఉ్రత్పేరకాన్ని తీసుకున్నందుకు రెండుసార్లు సినెర్ ‘పాజిటివ్’గా తేలాడు. అయితే మంగళవారం వరకు కూడా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత కాలం రహస్యంగా ఉంచారని, ఈనెల 26 నుంచి జరిగే యూఎస్ ఓపెన్‌లో అతడిని ఎలా అనుమతిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు’ అంటూ షపవలోవ్ (కెనడా) ట్వీట్ చేయగా... ఇలాంటి పనికి నిషేధం తప్ప మరో శిక్షే లేదని నిక్ కిరియోస్ (ఆ్రస్టేలియా) తీవ్రంగా స్పందించాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సినెర్ జూన్‌లో వరల్డ్ నంబరవన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చేతికి గాయాలు తగిలినప్పుడు లేదా కోసుకుపోయినప్పుడు వాడే ఆయింట్మెంట్, స్ప్రేలలో ఉండే ‘క్లోస్టెబల్’ స్పోర్ట్స్ నిషేధిత జాబితాలో ఉంది. మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ సమయంలోనూ, టోర్నీ ముగిసిన వారం తర్వాత సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో ఈ ఉత్రే్పరకం ఉన్నట్లు తేలింది. దాంతో ఈ టోర్నీలో సినెర్ సెమీస్ చేరడం ద్వారా వచ్చిన 3,25,00 డాలర్ల ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతోపాటు 400 పాయింట్లలో కూడా కోత విధించారు. దీనిపై అప్పీల్ చేసిన సినెర్ తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దానిని వాడిన ఫిజియోథెరపిస్ట్ మసాజ్ చేసిన కారణంగా తన శరీరంలోకి ప్రవేశించిందని, ఇక ముందు అలా జరగకుండా డోపింగ్ నిబంధనలు పాటిస్తానని స్పష్టం చేశాడు. అతని వాదనను అంగీకరిస్తూ టెన్నిస్ ఇంటి గ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) సినెర్ తప్పేమీ లేదంటూ క్లీన్ చిట్ కూడా ఇచి్చంది. అయితే తాజాగా ‘దురదృష్టకర ఘటనను మరిచి ముందుకు సాగుతాను’ అని సినెర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఇలాంటి విషయాలను సాధ్యమైనని ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచి, అంతా మరచిపోయేలా చేస్తూ అగ్రశ్రేణి ఆటగాళ్లను రక్షించడం కొత్త కాదని... అదే ఏ 400వ ర్యాంక్ ప్లేయర్ అయిఉంటే అది సాధ్యం కాదని మాజీ ప్లేయర్, టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ కూడా అభిప్రాయపడింది. మున్ముందు ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ఆసక్తికరం. -
ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే చాలామంది కరోనా నుంచి కోలుకున్న తర్వాతే బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి కారణం స్టెరాయిడ్ల వినియోగం, ఇతర అనారోగ్య సమస్యలని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా..తాజాగా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారి సంఖ్య 600కు చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం సుమారు 10 రాష్ట్రాలు బ్లాక్‌ఫంగస్‌ను(మ్యూకోమైకోసిస్)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాయి. ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం యాంఫోటెరిసిన్-బి అనే యాంటీ ఫంగల్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) (చదవండి: ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’) -
సరిగ్గా వాడితే సంజీవనే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పెరిగిన పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలోనూ ఈ అంశం వెల్లడైంది. అయితే రోగి పరిస్థితి అత్యంత విషమించిన పరిస్థితుల్లోనే వివిధ రకాల స్టెరాయిడ్స్‌లను ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. ఈ ట్రీట్మెంట్ వల్ల మంచి ఫలితాలు వచ్చినంత మాత్రాన కరోనా రోగులందరికీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదని, స్వల్ప ఇన్ఫెక్షన్తో పాటు మైల్డ్ కేసులకు స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమని హెచ్చరిస్తోంది. అయితే ఈ హెచ్చరికలు, సూచనలకు భిన్నంగా ఇటీవలి కాలంలో సీరియస్ కేసులు కాకపోయినా స్టెరాయిడ్స్ వినియోగం పెరిగిపోవడం పట్ల వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనవసరంగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. మనదేశంలో తక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్న పేషెంట్ల చికిత్సలోనూ స్టెరాయిడ్స్ వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, మోంటేపియొర్ హెల్త్ సిస్టమ్ నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. సర్వే ముఖ్యాంశాలు... కరోనా పేషెంట్లందరికీ స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ అవసరం లేదు. రోగి శరీరంలో కరోనా వైరస్ తీవ్రత పెరిగి ఆక్సిజన్ అవసరం ఎక్కువైనపుడు, ఇన్ఫ్లమేషన్ జాడలు పెరిగినప్పుడే ఈ చికిత్స ఉపయోగించాలి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగినపుడు, ఆక్సిజన్ తగ్గినప్పుడు, రోగనిరోధకశక్తి పుంజుకోనప్పుడు, శరీరంలో వైరస్ ఏ మేరకు వ్యాపించింది అన్న ప్రాతిపదికన డాక్టర్లు ఈ చికిత్సా విధానాన్ని ఎన్నుకుంటారు. కోవిడ్‌తో హై ఇన్ఫ్లమేషన్ ఉన్న కొందరు పేషెంట్లకు స్టెరాయిడ్స్ వాడితే వెంటిలేటర్ అవసరం రాకపోగా, మృత్యువాత పడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే సాధారణ, తక్కువ ఇన్ఫ్లమేషన్స్ ఉన్న పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే వెంటిలేటర్ అమర్చాల్సిన పరిస్థితి తలెత్తడంతో పాటు చనిపోయే ప్రమాదం 200 శాతం పెరిగినట్టు సర్వే పేర్కొంది. ‘క్రిటికల్ కోవిడ్ పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. రోగి «శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోతేనే ఈ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. సీటీ స్కానింగ్‌లో చిన్న మచ్చ కనబడగానే స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్న కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇది ఎంత మాత్రం మంచిదికాదు. రోగిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోకుండానే, వైరస్‌కు సంబంధించి తీవ్రమైన లక్షణాలు బయటపడక ముందే స్టెరాయిడ్స్ వాడకం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోయి వారి శరీరంలోంచి వైరస్ త్వరగా క్లియర్ కాదు. ఆరోగ్యపరంగానూ ఇతర సమస్యలు వస్తాయి. కరోనా రోగికి మొదటి పదిరోజుల్లో స్టెరాయిడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. – పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డా.విశ్వనాథ్ గెల్లా -
డెక్సామెథాసోన్కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి డెక్సామెథాసోన్ స్టెరాయిడ్‌ను ఉపయోగించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కేవలం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రమే డెక్సామెథాసోన్ వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధి పరిస్థితుల్లో ఉపయోగించే డెక్సామెథాసోన్‌ను కరోనాతో వెంటిలేర్‌పై ఉన్న వారికి, ఆక్సిజన్ సహాయం కావాల్సిన వారికి ఎక్కువ ధరతో కూడిన మిథైల్‌ప్రిడ్నిసోలోన్‌కు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన మెథాసోన్‌ను ఉపయోగించవచ్చని పేర్కొంది. ఈ డెక్సామెథాసోన్‌పై బ్రిటన్‌లో అనేక క్లినికల్ ట్రయల్స్ జరిగిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టెరాయిడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పిలుపునిచ్చింది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?) ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఓ బృందం నేతృత్వంలోని పరిశోధకులు కరోనాతో ఆస్పత్రిలో చేరిన 2 వేల మందికి పైగా రోగులకు డెక్సామెథాసోన్ ఇచ్చారు. అయితే వీరిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్న వారు, ఆక్సిజన్ సహాయం అందిస్తున్న వారి మరణాలను రేటును 35 శాతం తగ్గించింది. తక్కువ ధరకు లభించే స్టెరాయిడ్ గత 60 ఏళ్లుగా మార్కెట్లో లభిస్తోంది. కాగా భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం కొత్తగా 18,552 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, మొత్తం కేసుల సంఖ్య 5,08,953కు చేరింది. కరోనాతో తాజాగా 384 మంది మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు మొత్తం 15,685 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. (కరోనా: రెమ్డిసివిర్ మొదట ఆ అయిదు రాష్ట్రాలకే) -
కరోనా: ఈ మందు బాగా పనిచేస్తోంది!
లండన్ : కరోనా రోగులను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు చేస్తోన్న ప్రయోగాలు ఇప్పుడిప్పుడే విజయం సాధిస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభన ఎక్కువగా ఉన్న బ్రిటన్‌లో కరోనా రోగులకు సాధారణంగా అందుబాటులో ఉండే ‘స్టెరాయిడ్’ మందునిచ్చి మంచి ఫలితాలను సాధించినట్లు బ్రిటన్ వైద్యులు తెలియజేస్తున్నారు. ‘డెక్సామెథాసోన్’ అనే స్టెరాయిడ్‌ను ఇవ్వడం వల్ల వెంటిలేటర్లపై ఉన్న కరోనా రోగుల్లో మూడొంతుల మంది, ఆక్సిజన్ అవసరం రోగుల్లో ఐదొంతుల మంది కోలుకున్నారని ఈ చికిత్సకు నేతృత్వం వహిస్తోన్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే తెలిపారు. ఇంతకుముందే ఈ చికిత్సను ప్రారంభించి ఉన్నట్లయితే నాలుగువేల నుంచి ఐదు వేల మందిని ప్రాణాలు పోకుండా కాపాడి ఉండేవాళ్లమని ఆయన మీడియాతో చెప్పారు. ఈ స్టెరాయిడ్ చికిత్సకు అతి తక్కువ ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు. ఎన్హెచ్ఎస్లో ఈ కోర్స్‌కు ఐదు పౌండ్లు ఖర్చయితే, భారత్ లాంటి ఇతర దేశాల్లో ఓ డాలర్ లోపే ఖర్చు కావచ్చని ఆయన అన్నారు. 2,104 మంది కరోనా రోగులకు డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్‌ను రోజుకు నోటి ద్వారా 6 ఎమ్జీ లేదా నరాలకు ఇంజెక్షన్ ద్వారా పది రోజుల పాటు ఇవ్వడంతో చాలా మంచి ఫలితాలను సాధించామని ప్రయోగాత్మక చికిత్స విధానంలో పాల్గొంటున్న డాక్టర్ పీటర్ హార్బీ తెలిపారు. ఇప్పటి వరకు ఏ ఔషధం ఇవ్వలేనంత ప్రయోజనం ఈ మందు ద్వారా లభించిందని ఆయన చెప్పారు. (బీజింగ్‌లో మరోసారి కరోనా విజృంభణ) -
‘బతకాలంటే స్టెరాయిడ్స్ తప్పవన్నారు’
2014 నుంచి రెండేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డానని అంటున్నారు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్. స్టెరాయిడ్స్‌తోనే జీవితాంతం బతకాలని వైద్యులు చెప్పారని, ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు సుస్మిత. ‘‘నిర్బాక్’ అనే బెంగాలీ చిత్రంలో నటించిన తర్వాత అస్వస్థతకు గురయ్యాను. ఏం జరిగిందో తెలీలేదు. ఆ తర్వాత పలు వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అడ్రినల్ గ్రంథుల పనితీరు ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రభావం నా అవయవాలపై చూపింది. మాటిమాటికీ కళ్లు తిరిగి పడిపోతుండేదాన్ని. దాంతో ఇక బతికినంత కాలం హైడ్రోకోర్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఎనిమిది గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాలి. లేకపోతే బతకనని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు సుస్మిత. ‘కానీ ఆ స్టెరాయిడ్ వల్ల చాలా బరువు పెరిగాను, జుట్టు రాలిపోయేది. నేను సాధరణ మహిళనయితే అంతగా బాధపడేదాన్ని కాదు. కానీ నేను మాజీ విశ్వసుందరిని. నా ఆకారం చూసి ఏదో అయిపోయిందనుకుంటారని బయటికి రాలేకపోయాను. ఎలాగైనా కోలుకోవాలనుకున్నాను. చికిత్స నిమిత్తం జర్మనీ, లండన్ వెళ్లాను. ఆరోగ్యం కోసం ఏరియల్ సిల్క్ అనే యోగా సాధన చేశాను. వైద్యులు అవి చేయొద్దని సూచించినా నేను వినలేదు. 2016 చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురై కళ్లు తిరిగి పడిపోయాను. ఆ సమయంలో నేను అబుదాబిలో ఉన్నాను. నన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని చికిత్సల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. ఓసారి నేను తిరిగి భారత్‌కు వస్తుంటే నాకు చికిత్స చేసిన డాక్టర్ ఫోన్ చేసి చాలా సంతోషకరమైన వార్త చెప్పార’న్నారు. ‘ఆ డాక్టర్ ఫోన్లో ‘సుస్మిత.. ఇక నువ్వు ఆ స్టెరాయిడ్ మందులు వాడటం ఆపెయ్. ఎందుకంటే నీ ఒంట్లో అడ్రినల్ గ్రంథుల పనితీరు మెరుగుపడింది. కంగ్రాట్స్’ అని చెప్పారు. అది విన్నాక నా ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. సాధారణంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. కానీ నేను కోలుకున్నాను’ అని వెల్లడించారు సుస్మిత. -
లూపస్ అంటువ్యాధా? ఎందుకు వస్తుంది?
మా పక్కింటావిడకి లూపస్ వ్యాధి ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆవిడ తరచూ నా దగ్గరకు వస్తుంటుంది. దీనివల్ల నాకు కూడా ఆ వ్యాధి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. అసలు లూపస్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ జబ్బు ఎందుకు వస్తుంది? లూపస్ లేదా ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్) అనే ఈ వ్యాధి ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తి రోగిపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట. మనందరిలో ఒక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అది బయటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. జన్యులోపాల వంటి ఏవైనా కారణాల వల్ల మన వ్యాధి నిరోధక శక్తి... మన శత్రుకణాలను తుదముట్టించడానికి బదులుగా, మన సొంతకణాలనే మన శత్రువులుగా పరిగణించి, వాటిపై దాడి చేస్తుంది. దాంతో కంచే చేను మేసినట్టుగా మన సొంత అవయవాలే మన వ్యాధి నిరోధకశక్తి బారిన పడతాయి. అందువల్ల వచ్చే వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో ఒకరి నుంచి 15 మంది వరకు ఈ జబ్బు వస్తుంటుంది. సాధారణంగా 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి ఇది అంటుకోదు. కాబట్టి ఈ జబ్బు ఉన్నవారితో సన్నిహితంగా మెలగడం వల్ల, సహజీవనం చేయడం వల్ల ఈ వ్యాధి సోకదు. ఇలాంటి వ్యాధిగ్రస్తులను వెలివేయనక్కర్లేదు. పైపెచ్చు వారి పట్ల మరింత ప్రేమ, ఆదరణ చూపించడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి తగ్గి, మనోధైర్యం పెరుగుతుంది. అలా వ్యాధి తీవ్రతను కూడా తగ్గించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అలాగే ఒకే రోగిలో కూడా తరచూ లక్షణాలు మారిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే వ్యాధి ఉండవచ్చు. మరికొన్నిసార్లు చాలా తీవ్రరూపంలో లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధిని తొలిదశలో అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ రోగులు సూర్యరశ్మికి అతి సున్నితంగా ఉంటారు. ఎండబారిన పడ్డప్పుడు ఒంటిమీద ర్యాష్, దద్దుర్లు, దురద వంటివి కలుగుతాయి. వివిధ రకాలైన మచ్చలు, దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నోటిలో పూత, జుట్టు ఎక్కువగా రాలడం, కీళ్లనొప్పుల వంటివి ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలు. వ్యాధి తీవ్రత వల్ల కొందరిలో ఒక్కోసారి యుక్తవయసులోనే పక్షవాతం, గుండెపోటు, బుద్ధిమందగించడం వంటి విపరీత లక్షణాలు కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చూపుపోవడం, తరచూ ఫిట్స్‌రావడం, రక్తహీనత, తెల్లరక్తకణాలు–ప్లేట్లెట్లు తగ్గిపోవడం కూడా సంభవించవచ్చు. గుండె మీద, ఊపిరితిత్తుల మీద పొర ఏర్పడి, చుట్టూ నీరు చేరడం కూడా జరగవచ్చు. మహిళల్లో తరచూ గర్భస్రావాలు జరగడానికి కూడా లూపస్ ఒక కారణం. ఈ వ్యాధి ప్రభావం మూత్రపిండాలపై పడినప్పుడు ఒళ్లంతా వాపు, బీపీ పెరగడం, మూత్రం నుంచి ఎక్కువగా ప్రోటీన్ పోవడం వంటివి జరుగుతాయి. శరీరంలోని ఏ అవయవమైనా ఈ వ్యాధి బారిన పడవచ్చు. పై అవయవాలు ప్రభావితం అయినప్పుడు... వాటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండక, స్టెరాయిడ్స్ అనే మందులు వాడినప్పుడు ఉపశమనం కలుగుతుంటే... లూపస్ వ్యాధిని గుర్తించడానికి అది మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఇలాంటి రోగులను వెంటనే రుమటాలజిస్టులకు చూపించాలి. వ్యాధి నిర్ధారణ చేసి, వారి ఆధ్వర్యంలో మందులు వాడటం వల్ల ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ఆర్థరైటిస్ రోగుల ఆహారం ఎలా ఉండాలి? నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి. కీళ్లవాతం (ఆర్థరైటిస్) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. నిజానికి గౌట్ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప... వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్ వంటి పదార్థాలను తినకూడదు. అలాగే మద్యం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతోపాటు క్యాల్షియమ్ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు స్టెరాయిడ్స్ తప్పవా? నా వయసు 52 ఏళ్లు. నేను తొమ్మిది సంవత్సరాల నుంచి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాను. నొప్పి, వాపు తగ్గడం కోసం ప్రిడ్నిసలోన్ అనే మందును చాలా కాలం నుంచీ వాడుతున్నాను. రెండేళ్ల నుంచి నొప్పి పెరిగింది. ప్రతి నెలా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తున్నాను. నెల కిందట నా ఎడమ కాలు ఎముక విరిగి, ఇంట్లో పనులు చేసుకోడానికి ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధికి స్టెరాయిడ్స్ కాకుండా మెరుగైన చికిత్స ఏదైనా ఉందా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఒంట్లో ఉండే రక్షణ వ్యవస్థ మన కణాలనే గుర్తించే సమర్థతను కోల్పోయి మన శరీర అవయవాలపైనే దాడి చేస్తుంది. దాంతో ఈ వ్యాధి వస్తుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనిని ప్రారంభదశలోనే గుర్తించి సకాలంలో చికిత్సను ప్రారంభించాలి. నిపుణులు వ్యాధి తీరును బట్టి, తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. అనేక చికిత్స విధానాలు ఉన్నాయి. స్టెరాయిడ్స్ అనేవి చికిత్స విధానాలలో ఒక భాగం. వీటిని దీర్ఘకాలం వాడితే చాలా రకాల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి షుగర్, నొప్పి, ఎముకలు బలహీనంగా కావడం... దాంతో తేలిగ్గా విరిగిపోవడం, కంటి శుక్లం, అంటువ్యాధులకు తేలిగ్గా లోనుకావడం వంటివి ముఖ్యమైనవి. కాబట్టి చికిత్స చేసే డాక్టర్లు స్టెరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ మందులను ఉపయోగిస్తారు. వ్యాధి నిర్ధారణ జరగగానే వీటిని ఉపయోగించాలి. వీటితో పాటు చిన్న చిన్న మోతాదుల్లోనే స్టెరాయిడ్స్‌ను మూడు నుంచి ఆర్నెల్ల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ స్టెరాయిడ్ స్పేరింగ్ మందుల వల్ల వ్యాధి తీవ్రతను, తీవ్రమైన వ్యాధి వల్ల కలిగే నొప్పి, వాపు, క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. ఇటీవల అనేక ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని బయొలాజిక్స్ అంటారు. తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ మందుల వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. త్వరగా స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12,బంజారాహిల్స్, హైదరాబాద్. -
నల్ల గుడ్డు చుట్టూ గుండ్రంగా తెల్లగా...
నా వయస్సు 17 ఏళ్లు. సంవత్సరం క్రితం నాకు రెండు కళ్లలోనూ కార్నియా (నల్లగుడ్డు) చుట్టూ తెల్లగా వచ్చింది. కళ్ల డాక్టర్గారికి చూపించాను. ‘డస్ట్ అలర్జీ’ అన్నారు. ఐ డ్రాప్స్ రాసి ఇచ్చారు. అవి వేసుకున్న కొన్ని నెలలకు తగ్గినట్లే తగ్గి వుళ్లీ మెుదటిలో లాగానే వచ్చింది. ఎన్నో కంటి ఆసుపత్రుల్లో చూపించాను. కానీ ఇది వూత్రం తగ్గడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి. గత రెండు నెలలుగా కళ్లు బాగా దురద పెడుతున్నాయి. ఎరుపెక్కుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా సవుస్య ఎదురవతుందేమోనని భయంగా ఉంది. ఇది అలర్జీతో వచ్చిన సవుస్యే. బయటి కాలుష్యానికీ, పుప్పొడికీ, దువు్మూ ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే అలర్జీ ఉన్నవాళ్లకు ఇలాంటి సవుస్య వచ్చే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘వీకేసీ’ అంటే... వెర్నల్ కెరటో కంజక్ట వైటిస్’ అంటారు. అందుకే మనం కాలుష్యాలకు దూరంగా ఉంటూ, కంటిని ఎప్పుడూ రక్షించుకోవాలి. రక్షణ కోసం ప్లెయిన్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడితే చాలావుట్టుకు రక్షణ ఉంటుంది. ఈ సవుస్య ఉన్నవారు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కంటిని స్వచ్ఛమైన నీటితో కడుగుతూ ఉండాలి. డాక్టర్‌ను సంప్రదించి యాంటీ అలర్జిక్ చుక్కల వుందు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇందులో స్టెరాయిడల్, నాన్ స్టెరాయిడల్ (స్టెరాయిడ్ లేనివి) అనే రెండు మందులు ఉంటాయి. స్టెరాయిడ్ మాత్రం డాక్టర్గారి పర్యవేక్షణలో తాత్కాలికంగానే వాడాలి. దీర్ఘకాలం వాడకూడదు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాన్‌స్టెరాయిడ్ (స్టెరాయిడ్ లేనివి) వంటివి మాత్రం చాలా కాలం వరకు వాడవచ్చు. ఉదాహరణకు ఓలోపాటడిన్ వంటి నాన్‌స్టెరాయిడ్ డ్రాప్స్ రోజుకు రెండుసార్లు చొప్పున ఆరుమాసాల వరకు వాడవచ్చు. అలాగే లూబ్రికెంట్ డ్రాప్స్ కూడా వాడాలి. దాంతో అలర్జెన్స్ పలచబారుతాయి. కంటికి ఉపశమనం కలుగుతుంది. అప్పుడు నల్లగుడ్డు చుట్టూ ఉన్న తెల్లటి రంగు క్రమంగా మాయమవుతుంది. మీకు దేనితో అలర్జీ వస్తుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. ఎక్కువ అలర్జీ ఉన్నప్పుడు యాంటీహిస్టమైన్ ఐ డ్రాప్స్, యాంటీహిస్టమైన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. ఆ మందులతో తప్పకుండా అలర్జీ నియంత్రణలోకి వస్తుంది. ఈ సవుస్యను దీర్ఘకాలం ఇలాగే వదిలేస్తే చూపు వుందగించడం, కార్నియా పొర దెబ్బతినడం వంటి సవుస్యలు వస్తాయి కాబట్టి వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకొని దీర్ఘకాలం వుందులు వాడండి. ఇప్పుడు ఆధునికమైన వుంచి వుందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ సవుస్య గురించి ఆందోళనపడాల్సిందేమీ లేదు. కళ్లు పొడిబారుతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయసు 47 ఏళ్లు. నేను దాదాపుగా ఎప్పుడూ కంప్యూటర్‌పైనే వర్క్ చేస్తుంటాను. కళ్లు విపరీతంగా పొడి బారుతున్నాయి. ఈ వేసవి ఎండవేడితో ఈ ఫీలింగ్ మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. దాంతో మాటిమాటికీ వెళ్లి... నీళ్లతో కళ్లు కడుక్కొని వస్తున్నాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. కంప్యూటర్‌పై ఎప్పుడూ కనురెప్పలు తదేకంగా ఏకాగ్రతతో ఆర్పకుండా చూసేవారికి కన్నుపొడిబారే సమస్య రావచ్చు. దీనికి వయసు పైబడటం, ఎప్పుడూ ఎయిర్కండిషన్డ్ గదుల్లో ఉండటం, కంటికి గాయం కావడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. వైద్యపరిభాషలో ఈ సమస్యను ‘కెరటో కంజంక్టివైటిస్ సిక్కా’ అంటారు. ఇందులో కంటిలోని కార్నియా, కంజంక్టివా పొరలు పొడిబారిపోతాయి. దీన్నే ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యకు నివారణ కోసం చేయాల్సినవి... ►కంటి రెప్పలను తరచూ ఆర్పుతూ ఉండాలి. ఎప్పుడూ తదేకంగా చూస్తూ ఉండకూడదు ►మనం చదువుతున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ►చదువుతున్నప్పుడు మధ్యమధ్య కాసేపు కంటికి విశ్రాంతినివ్వండి. చిన్న అక్షరాలను చాలాసేపు చదవద్దు. అలా చదవాల్సి వస్తే మధ్య మధ్యన కాసేపు దూరంగా కూడా చూపును ప్రసరిస్తూ ఉండండి. మనం చదవాల్సినదెప్పుడూ కంటి కంటే కిందనే ఉండాలి. పై వైపు చూస్తూ చదవాల్సి వస్తే అది కేవలం కాసేపే తప్ప... ఎప్పుడూ అలా ఉండే అక్షరాలను చదువుతూ ఉండవద్దు మీరు చదవాల్సినప్పుడూ నేరుగా ఉండాలి. స్క్రీన్‌ను వాలుగా ఉంచి చదవవద్దు. మీరు స్క్రీన్‌పై చూడాల్సి ఉన్నప్పుడు ఎక్కువ చూడాల్సిన స్క్రీన్‌కూ, దాని బ్యాక్డ్రాప్కూ ఎక్కువ కాంట్రాస్ట్ లేకుండా చూసుకోండి ►టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి. చీకట్లో టీవీ చూడవద్దు. టీవీ చూసే సమయంలో స్క్రీన్‌నే తదేకంగా చూడవద్దు. మధ్య మధ్యన దృష్టిని మరలుస్తూ ఉండాలి తరచూ ఆరుబయటకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ ఏసీలో ఉండేవారు తరచూ స్వాభావికమైన సూర్యకాంతిలో వెలుతురుకూ ఎక్స్పోజ్ అయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏసీ ఇంటెన్సిటీని మరీ ఎక్కువగా పెంచుకోవద్దు. ఇది కళ్లు మరీ పొడిబారడానికి దారితీస్తుంది. రూమ్‌లో హ్యుమిడిఫైయర్స్ ఉంచుకోవాలి. డాక్టర్‌ను సంప్రదించి ఆర్టిఫిషియల్ టియర్స్ వాడాలి. యాంటీ గ్లేర్ గ్లాసెస్ కొంతవరకు మీకు ఉపయోగపడతాయి ∙శరీరం నుంచి నీటి పాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తరచూ ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహారం గానీ లేదా కాప్సూ్యల్ గానీ తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు అంటే... అన్నిరకాల వైటమిన్లు (ఏ, బీ,సీ), ఖనిజాలు... ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోండి ∙ఆరుబయట తిరిగేప్పుడు కళ్లజోడును కాసేపు తీయండి. ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అవలంబించండి ►కంటికి మురికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. చేతులు మురికి అయినప్పుడు వాటితోనే కళ్లు తుడుచుకోవద్దు ►మీ కళ్లు శుభ్రం చేసుకోడానికి, ముఖం కడక్కోడానికి శుభ్రమైన నీటిని ఉపయోగించండి. అందులో డిటర్జెంట్ లేకుండా చూసుకోండి ►పొగతాగే అలవాటు, ఆల్కహాల్ అలవాట్లను తక్షణం మానివేయండి. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్,హైదరాబాద్. -
14 రకాల స్టెరాయిడ్లపై కేంద్రం ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఔషధాల రూపంలో ఉండి ఉత్ప్రేరకాలుగా వినియోగించే 14 స్టెరాయిడ్ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆదే శాలు జారీ చేసింది. వీటి అమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైద్యులు రాసి ఇచ్చే మందుల కాగితం (ప్రిస్క్రిప్షన్) లేకుండా ఈ స్టెరా యిడ్లను విక్రయించకూడదని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి విక్రయాలు జరిపిన ఔషధ దుకాణాల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తాజాగా ఆంక్షలు విధించిన 14 స్టెరాయిడ్లు చర్మ వ్యాధులకు సంబంధించినవే ఉన్నాయి. డ్రగ్, కాస్మొటిక్ నిబంధనలు–1945 ప్రకారం ఈ మందులు షెడ్యూల్–హెచ్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. కేన్సర్ వ్యాధికి కారణమవుతుండటంతో.. ఆలక్లొమెటాసోన్, బెటామెథాసోన్, డెసొనైడ్, డెసొగ్జిమెటా సోన్, డెక్సామెథసోన్, డైఫ్లోరాసోన్ డయాసిటేట్, ఫ్లూసినోనైడ్, ఫ్లూసినోలేన్ ఆక్టొనైడ్, హాలొమెటసోమ్, మిథైల్ప్రిడెన్ సోన్, ప్రిడ్నికార్బొట్, ట్రాయామిక్నోలేన్ ఆక్టొనైడ్ వంటి మందులపై కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆంక్షలు విధించింది. ఈ ఉత్పత్తులు కేన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని, మరెన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా వీటిని వినియోగించేలా చర్మవ్యాధి నిపుణులు, జనరల్ ఫిజిషియన్లు సూచించవద్దని తెలిపింది. ఆంక్షలు విధించిన ఉత్పత్తులను వినియోగించిన వారు వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుందన్నారు. -
స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి హాని
హైదరాబాద్: మేని నిగారింపును పెంచే హామీతో మార్కెట్లో లభిస్తున్న పలు స్టెరాయిడ్ ఆధారిత క్రీములు నిజానికి చర్మానికి మేలుకన్నా ఎంతో హాని చేసేవిగా ఉంటున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరియాలజిస్ట్స్ అండ్ లెప్రోలజిస్ట్స్(ఐఏడీవీఎల్) తెలిపింది. పాండెర్మ్ తదితర క్రీములు ఈ కోవకి చెందినవిగా పేర్కొంది. ఇవి క్లోబీటాసోల్ అనే స్టెరాయిడ్‌తో పాటు యాంటీబయోటిక్, యాంటీ-అమీబిక్, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడే 4 రకాల ఔషధాల అసంబద్ధ కాంబినేషన్లతో తయారవుతున్నాయంది. రూ. 1,555 కోట్ల టాపికల్ స్టెరాయిడ్స్(చర్మంపై పూసే స్టెరాయిడ్స్ క్రీములు) మార్కెట్లో సుమారు 85 శాతం వాటా ఈ తరహా కాంబినేషన్ క్రీములదే ఉంటోందని తెలిపింది. చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో దాదాపు 60 శాతం మంది ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ గల క్రీములను వాడుతున్నట్లు 2011లో 12 నగరాల్లో తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది. వీటిపై 2005 నుంచి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ లేవని ఐఏడీవీఎల్ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అబీర్ సారస్వత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐతో పాటు ఫార్మా విభాగం కార్యదర్శిని కలిసిన ఐఏడీవీఎల్ బృందం ఇటువంటి అసంబద్ధ కాంబినేషన్ల క్రీముల తయారీ, అమ్మకాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.