సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పెరిగిన పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలోనూ ఈ అంశం వెల్లడైంది. అయితే రోగి పరిస్థితి అత్యంత విషమించిన పరిస్థితుల్లోనే వివిధ రకాల స్టెరాయిడ్స్‌లను ఉపయోగించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. ఈ ట్రీట్‌మెంట్ వల్ల మంచి ఫలితాలు వచ్చినంత మాత్రాన కరోనా రోగులందరికీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదని, స్వల్ప ఇన్ఫెక్షన్‌తో పాటు మైల్డ్ కేసులకు స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమని హెచ్చరిస్తోంది. అయితే ఈ హెచ్చరికలు, సూచనలకు భిన్నంగా ఇటీవలి కాలంలో సీరియస్ కేసులు కాకపోయినా స్టెరాయిడ్స్ వినియోగం పెరిగిపోవడం పట్ల వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అనవసరంగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే అనర్థాలు తప్పవంటున్నారు నిపుణులు. మనదేశంలో తక్కువ ఇన్‌ఫ్లమేషన్ ఉన్న పేషెంట్ల చికిత్సలోనూ స్టెరాయిడ్స్ వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, మోంటేపియొర్ హెల్త్ సిస్టమ్ నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
సర్వే ముఖ్యాంశాలు...
కరోనా పేషెంట్లందరికీ స్టెరాయిడ్స్ ట్రీట్‌మెంట్ అవసరం లేదు. రోగి శరీరంలో కరోనా వైరస్ తీవ్రత పెరిగి ఆక్సిజన్ అవసరం ఎక్కువైనపుడు, ఇన్‌ఫ్లమేషన్ జాడలు పెరిగినప్పుడే ఈ చికిత్స ఉపయోగించాలి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫ్లమేషన్ పెరిగినపుడు, ఆక్సిజన్ తగ్గినప్పుడు, రోగనిరోధకశక్తి పుంజుకోనప్పుడు, శరీరంలో వైరస్ ఏ మేరకు వ్యాపించింది అన్న ప్రాతిపదికన డాక్టర్లు ఈ చికిత్సా విధానాన్ని ఎన్నుకుంటారు. కోవిడ్‌తో హై ఇన్‌ఫ్లమేషన్ ఉన్న కొందరు పేషెంట్లకు స్టెరాయిడ్స్ వాడితే వెంటిలేటర్ అవసరం రాకపోగా, మృత్యువాత పడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే సాధారణ, తక్కువ ఇన్‌ఫ్లమేషన్స్ ఉన్న పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే వెంటిలేటర్ అమర్చాల్సిన పరిస్థితి తలెత్తడంతో పాటు చనిపోయే ప్రమాదం 200 శాతం పెరిగినట్టు సర్వే పేర్కొంది.
‘క్రిటికల్ కోవిడ్ పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. రోగి «శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోతేనే ఈ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. సీటీ స్కానింగ్‌లో చిన్న మచ్చ కనబడగానే స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్న కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇది ఎంత మాత్రం మంచిదికాదు. రోగిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోకుండానే, వైరస్‌కు సంబంధించి తీవ్రమైన లక్షణాలు బయటపడక ముందే స్టెరాయిడ్స్ వాడకం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోయి వారి శరీరంలోంచి వైరస్ త్వరగా క్లియర్ కాదు. ఆరోగ్యపరంగానూ ఇతర సమస్యలు వస్తాయి. కరోనా రోగికి మొదటి పదిరోజుల్లో స్టెరాయిడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. – పల్మనాలజిస్ట్, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డా.విశ్వనాథ్ గెల్లా
Comments
Please login to add a commentAdd a comment