సాక్షి, హైదరాబాద్: ఔషధాల రూపంలో ఉండి ఉత్ప్రేరకాలుగా వినియోగించే 14 స్టెరాయిడ్ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆదే శాలు జారీ చేసింది. వీటి అమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
వైద్యులు రాసి ఇచ్చే మందుల కాగితం (ప్రిస్క్రిప్షన్) లేకుండా ఈ స్టెరా యిడ్లను విక్రయించకూడదని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి విక్రయాలు జరిపిన ఔషధ దుకాణాల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఔషధ నియంత్రణ మండలి తాజాగా ఆంక్షలు విధించిన 14 స్టెరాయిడ్లు చర్మ వ్యాధులకు సంబంధించినవే ఉన్నాయి. డ్రగ్, కాస్మొటిక్ నిబంధనలు–1945 ప్రకారం ఈ మందులు షెడ్యూల్–హెచ్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
కేన్సర్ వ్యాధికి కారణమవుతుండటంతో..
ఆలక్లొమెటాసోన్, బెటామెథాసోన్, డెసొనైడ్, డెసొగ్జిమెటా సోన్, డెక్సామెథసోన్, డైఫ్లోరాసోన్ డయాసిటేట్, ఫ్లూసినోనైడ్, ఫ్లూసినోలేన్ ఆక్టొనైడ్, హాలొమెటసోమ్, మిథైల్‌ప్రిడెన్ సోన్, ప్రిడ్నికార్బొట్, ట్రాయామిక్నోలేన్ ఆక్టొనైడ్ వంటి మందులపై కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆంక్షలు విధించింది.
ఈ ఉత్పత్తులు కేన్సర్ వ్యాధికి కారణమవుతున్నాయని, మరెన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా వీటిని వినియోగించేలా చర్మవ్యాధి నిపుణులు, జనరల్ ఫిజిషియన్లు సూచించవద్దని తెలిపింది. ఆంక్షలు విధించిన ఉత్పత్తులను వినియోగించిన వారు వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment