మెదడు కూడా వ్యాయామం చేయాల్సిందే!
మీకు తెలుసా?
మెదడు కూడా కండరంలాంటిదే. వ్యాయామం చేయకపోతే దేహంలోని ఇతర కండరాల్లాగానే మెదడు కూడా శక్తిహీనమవుతుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే...
కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వీలయినంతగా చదవాలి.
కొత్త భాషను నేర్చుకునే క్రమంలో మెదడు చురుగ్గా స్పందించి ఉత్తేజితమవుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం అంటే మెదడుకి తగినంత వ్యాయామం అందించినట్లే.
మానసిక ఒత్తిడి వల్ల కార్టిజోల్ హార్మోన్ విడుదలవుతుంది. అది మెదడు పనితీరును నిరోధిస్తుంది. కాబట్టి ఒత్తిడికి లోనయినట్లు గుర్తించిన వెంటనే పది నిమిషాల సేపు ఇష్టమైన పని (ఇష్టమైన పుస్తకం చదవడం లేదా ఒక పజిల్‌ని పరిష్కరించడం) చేయడం వల్ల ఒత్తడి తగ్గి మెదడు ఉత్తేజితమవుతుంది.
ఆహారంలో ‘బి’ విటమిన్ పుష్కలంగా తీసుకోవాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా తీసుకోవాలి. రోజుకు కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసినప్పుడు ఊపిరితిత్తులు దీర్ఘంగా శ్వాసిస్తాయి. దాంతో దేహం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకుంటుంది. దాంతో మెదడు చురుగ్గా ఉంటుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి నశిస్తాయి.