బ్రెయిన్‌ను జిల్లు మనిపించండి | Family health counciling:Brain special | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ను జిల్లు మనిపించండి

Published Thu, Jun 7 2018 12:23 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

Family health counciling:Brain special - Sakshi

బోర్‌ కొడుతుంటే కొత్త డోర్‌ ఓపెన్‌ చేయాలి... బ్రైన్‌కి కొత్త రోడ్‌ వేయాలి.మొదడులో కొత్త స్విచ్‌ను ఒత్తి కొత్త బల్బులు వెలిగించాలి. అదీ సంగతి... స్విచ్‌ చేయండి... కొత్త అలవాట్లకి.... కొత్త ప్రక్రియలకి... కొత్త జిల్లులకి. మార్పు చేస్తుంది బ్రైన్‌ను షార్ప్‌. 

ఇవాళ కొంచెం రొటీన్‌ని బ్రేక్‌ చేద్దామా?... అంటే?ఏం లేదు... రోజూ కుడి చేత్తో ఎత్తే కాఫీ గ్లాసును ఎడమచేత్తో ఎత్తడం.కుడి చేత్తో చేసే పళ్లు తోముకోవడాన్ని ఎడమ చేత్తో చేయడం.కుడి చేత్తో దువ్వుకునే తలను ఎడమ చేత్తో దువ్వడం.సైకిల్‌నో స్కూటర్‌నో ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఎక్కడం.రోజూ ఈ వైపు నుంచి దిగే మంచాన్ని ఆ వైపు నుంచి దిగడం.రోజూ అలవాటైన దారిలో కాకుండా ఇంకొక దారిలో ఆఫీసుకు వెళ్లడం.ఇవన్నీ చేస్తే?... చేస్తే మంచిది.ఎవరికి మంచిది? మీకు మంచిది... మీ మెదడుకు మంచిది... అలవాటైన పద్ధతుల్లో అలవాటైన విధానాల ద్వారా మీ జీవితం సాగుతున్నప్పుడు సుప్తావస్థలోకి వెళ్లి ఆ రొటీన్‌కు అలవాటు పడిన మీ మెదడులోని కణాలు చైతన్యవంతం కావడానికి మంచిది. దీనివల్ల మెదడులోని కొత్త పాత్‌వేస్‌ అకస్మాత్తుగా చురుగ్గా మారతాయి. నిద్రాణంగా ఉన్నవి మళ్లీ చురుగ్గా మారతాయి. అంటే... టోటల్‌గా మెదడులోని చాలాభాగం చురుగ్గా మారుతుందన్న మాట. మెదడును తట్టి లేపి చైతన్యవంతం చేసే ఇలాంటి వ్యాయామన్నే ‘న్యూరోబిక్స్‌’ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కొన్ని పనులు భిన్నంగా, కొన్ని పనులు ఎరుకతో చేయడమే న్యూరోబిక్స్‌.

ఉదాహరణకు:
మీ జేబులో ఉన్న నాణేలను ముట్టుకొని, వాటి అంచులను పరిశీలించి, ఆ స్పర్శతో ఆ నాణెం విలువ ఎంతో ఊహించండి. బయటికి తీసి మీరు రైటో కాదో చెక్‌ చేసుకోండి.  కళ్లు మూసుకొని, మీ ఇంట్లోని ఏ ఫర్నిచర్‌ ఎక్కడుందో కనిపెడుతూ వెళ్లండి. కళ్లు తెరచి మీ అంచనా ఎంత కరెక్టో చూడండి.  టీవీని కాసేపు మ్యూట్‌లో పెట్టండి. తెర మీది క్యారెక్టర్స్‌ ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించండి. మళ్లీ మ్యూట్‌ తొలగించి  మీరెంత కరెక్ట్‌గా ఊహించారో పరీక్షించుకోండి.    నాలుగైదు రకాల సుగంధద్రవ్యాలను ఒకేలా ఉన్న సీసాలలో పెట్టించండి. కళ్లకు గంతలు కట్టుకొని వాటిని వాసన ద్వారా కాకుండా స్పర్శ ద్వారా అవేమిటో తెలుసుకోండి. ఇలా చేసి చూస్తే ఏమవుతుందని మీరు అడగవచ్చు. ఇలా చేయడం మెదడుకు ఒక ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. ఒంటికి చేసే వ్యాయామాలు ఏరోబిక్స్‌. మరి మైండ్‌కు? అవి న్యూరోబిక్స్‌. ఇవి  బ్రెయిన్‌ను షార్ప్‌గా పనిచేయడంతో పాటు ... దీర్ఘకాలంలో మతిమరపు (డిమెన్షియా), అలై్జమర్స్‌ లాంటివాటిని నివారిస్తాయని కొందరు అంటారు.

సైనాప్స్‌ కోసం
మన మెదడు కార్యలాపాలన్నీ వాటంతట అవే జరిగిపోతుంటాయి. ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే వస్తుంటాయి... పోతుంటాయి.  మైండ్‌ యాక్టివిటీ చాలావరకు ఆటోమేటిక్‌.  మెదడు కణాలైన న్యూరాన్లు ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అయ్యే కనెక్షన్లను సైనాప్స్‌ అంటారు. సైనాప్స్‌ ఎంతబాగా ఒకదానితో మరొకటి కనెక్ట్‌ అయి ఉంటే ఆలోచనలు అంత విస్తృతంగా, వైవిధ్యంగా ఉంటాయి. మన చర్యలు రొటీన్‌గా మారినప్పుడు సైనాప్స్‌ నిద్రాణస్థితిలోకి వెళతాయి. అవి తుళ్లి పడేలా చేయడానికి చైనత్యవంతం కావడానికి రొటీన్‌ పనిని భిన్నంగా చేయడం అవసరం. ఇది ఇంకా బాగా తెలియాలంటే దీనికి కార్యక్షేత్రమైన మెదడు గురించి తెలియాలి

న్యూరోబిక్స్‌ చేయడం ఎలా? 
మీరు నిద్రలేవడానికి ఎప్పుడూ ఒకేరకం అలారం పెట్టుకొని లేస్తుంటారా? ఈసారి డిఫరెంట్‌ టోన్‌లో అలారం పెట్టుకోండి. మెదడు దానిని గుర్తించి మేల్కొనడానికి కొత్త పాత్‌వే సృష్టించుకుంటుంది.   ఫోన్లో రింగ్‌టోన్‌ మార్చండి. అది మోగినప్పుడు మీ మెదడు వెంటనే స్పందించదు. అది ఒకే రకమైన రింగ్‌టోన్‌కు  ఫిక్సయి ఉంది. కానీ కొత్త రింగ్‌టోన్‌ మోగుతున్నప్పుడు  మీకైమీరు పెట్టుకున్న రింగ్‌టోన్‌ అని గుర్తొచ్చి బ్రెయిన్‌లో కొత్త పాత్‌వే ఏర్పడుతుంది. ఇలా మీరు వదిలేస్తున్న అంశాలనూ మళ్లీ ఉపయోగంలోకి తెస్తుండటంతో అప్పటివరకూ మీరు లూజ్‌ చేసుకునేవి కూడా మీరు యూజ్‌ చేసుకునేవే అవుతున్నాయి.  కింద మీరు చేయదగిన ఇలాంటివే మరికొన్ని మీ కోసం... 

బాత్‌రూమ్‌లో: మీ సబ్బును మారుస్తూ కొత్త  వాసనలు పీలుస్తుండాలి. కొత్తవి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడూ వాడే నోటు కాకుండా సరికొత్త కరెన్సీ నోట్‌ మీ పర్స్‌లోకి వచ్చిందనుకోండి. విలువ సేమ్‌ అయినా కాసేపైనా దాన్ని అపురూపంగా చూస్తారు కదా. అలాగే ఈ కొత్త అనుభవాలూ మీకు కొత్త థ్రిల్‌నూ, జీవితేచ్ఛనూ ఇస్తాయి. 

ఆఫీసుకు వెళ్లే దారిలో : మీ  వాహనాన్ని అలవాటైన ఒకే రూట్‌లో కాకుండా, వేర్వేరు రూట్స్‌లో నడుపుతుండండి. దాంతో మీకు కొత్తదారులు తెలుస్తాయి. ఎప్పుడైనా ఒక రూట్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు... దాన్ని అధిగమించడానికి అప్పటికే తెలిసిన ‘కొత్త దారులు’ మీకు స్ఫురిస్తాయి. 

పనిలో: మనం పనిచేసే చోట మీ వస్తువుల్నీ, ఉపకరణాలన్నీ ఎప్పుడూ ఒకే లా ఉండకుండా చూడ ండి. కొత్త రంగు పెన్సిల్‌ నూ, కొత్త రంగు పెన్‌నూ, కొత్త ఇంక్‌నూ వాడండి. రొటీన్‌ భిన్నంగా ఉండే కొత్తది ఎప్పుడైనా మనకు ఉత్తేజాన్నే ఇస్తుంటుంది. 

మెదడును ఉపయోగించండి: మీరు రోజూ చేసే పనిని రొటీన్‌గా చేయకండి. కాస్తంత వేరుగా ఎలా చేయగలమో ఆలోచించండి. వైవిధ్యమైనవీ, విభిన్నమైనవీ ఆలోచనలు చేసి, అవి మీ పనికి ఎలా ఉపకరించగలవో చూడండి. అమలు చేయండి. తేడా గమనించండి.  

బ్రెయిన్‌ స్టార్మింగ్‌: ఆలోచనలు అలల్లాగా వస్తాయంటారు. ఒకరి ఆలోచనలు కొన్ని అలలైతే... ఎంతోమంది ఆలోచనలలు కలిస్తే... అదొక అలల వెల్లువ. ఆ వెల్లువ తీవ్రత మరింత పెరిగితే! అది అల స్థాయి నుంచి ఉప్పెనగా మారుతుంది. అయితే మీ  స్నేహితులు, వాళ్లు మీకు ఇచ్చే కంపెనీ, వారందరి ఆలోచనల వెల్లువ ఉప్పెనగా మారితే... అదే బ్రెయిన్‌ స్టార్మింగ్‌. మామూలు స్టార్మ్‌ వినాశకమైతే... ఈ తుఫాను మంచిది. మేలు చేసేది. కాకపోతే మీ మిత్రులంతా మంచివాళ్లయి ఉండాలంతే.

భోజనాల దగ్గర: భోజనాల సమయంలో ఎప్పు డూ మీకు అలవాటైన ఫుడ్‌ మాత్రమే కాకుండా మెనూ మార్చండి. 

మార్కెట్‌లో:  ప్రతిసారీ ఒకే షాప్‌కు వెళ్లకండి. కొత్త చోట్లకు వెళ్లి     అక్కడి ఉత్పాదనల్లోని ఇన్‌గ్రేడియెంట్స్‌ చూడండి. ఎప్పుడూ కొత్త చాక్లెట్లూ, కొత్త బిస్కెట్లూ్ల ట్రై చేయండి. పాలవాడు  ఇంటికి వచ్చి పాలపాకెట్‌ వేయడం మామూలే. అప్పుడప్పుడూ మీరే  వెళ్లి పాలపాకెట్‌ తెండి. 

ట్రావెల్‌: మీరు ప్రయాణాలు చేయడం అన్నది అత్యద్భుతమైన ‘న్యూరోబిక్‌’ వ్యాయామం. కొత్త ప్రాంతాలూ, కొత్త ముఖాలు, కొత్త ఆహారాలూ ఇవన్నీ మీ ప్రమేయం లేకుండానే సమకూరుతాయి. దాంతో మెదడులో ఆలోచనల కొత్త పాత్‌వేస్‌ ఏర్పడతాయి. మీరెంతగా ఎక్సయిట్‌ అవుతున్నారంటే... అంతగా ‘న్యూరోబిక్‌’ యాక్టివిటీ జరుగుతుందని అర్థం. అన్నట్టు... ఎప్పుడూ ఒకే వాహనంలో వెళ్లకండి. అప్పుడప్పుడూ మీ వాహనాన్ని మీ ఫ్రెండ్‌కు ఇచ్చి... అతడిది మీరు వాడండి. 

మాట్లాడండి: భావాలను వ్యక్తపరచండి. మీరు బాగా సిగ్గరా? అయితే కనీసం బాత్‌రూమ్‌లోనైనా మీ భావాలను బయటకు చెప్పండి. ఎప్పుడూ పాడే పాటలు కాకుండా కొత్త పాటలు పాడుతుండండి. 

విశ్రాంతిగా ఉన్నప్పుడు: ఏదైనా కొత్త హాబీని ప్రయత్నించండి. కొత్త ఫొటో తీయండి. కొత్త సంగీతవాద్యాన్ని ప్లేచేయండి. చెస్‌ ఆడండి. లేదా కొత్త గాడ్జెట్, కొత్త యాప్‌ వాడుతుండండి. మీరు చూడండి. కొందరు కొత్త కొత్త గాడ్జెట్స్‌ వాడుతూ, దాని అంతు చూడాలనుకుంటారు. కొత్తవాటిని ఎంతగా ప్రయత్నిస్తున్నారంటే... మీలో అంతగా జీవనోత్సాహం ఉందన్నమాట.

ఇలా చేస్తుంటే ఏమవుతుంది...
మెదడుకు ఏరోబిక్స్‌ అయిన ఈ న్యూరోబిక్స్‌తో మెదడులోని పాత కణాలే... సరికొత్త కణాలుగా మళ్లీ తమను తాము ఆవిర్భవించుకుంటాయి. తమ పనిని కొత్తగా ఆవిష్కరించుకుంటాయి. మైండ్‌కు కొత్త పవర్‌ సమకూరుతుంది. మీ విజయరహస్యం మీ మైండ్‌ పవరే కదా. ఆ పవర్‌ మీకుంటే మీరెప్పుడూ ఫిట్‌. మీరెప్పుడూ యంగ్‌. 

మెదడు గురించి కొంచెం...
మెదడు బరువు మహా అయితే 1.4 కిలోలు.  ఈ కొద్ది బరువే తనకంటే దాదాపు 50 రెట్ల బరువున్న దేహాన్ని  చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. నిత్యం దాన్ని నడిపిస్తుంటుంది. మెదడులో 85 శాతం నీళ్లే. మెదడు కణాలన్నీ కొవ్వు కణాలే. శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌లో 25 శాతం మెదడులోనే ఉంటుంది.  ఒంటికి అందే ఆక్సిజన్‌లో 20 శాతం ఆక్సిజన్‌ తీసుకుంటుంది. మెదడులో  దాదాపు 1,000 కోట్ల కణాలు ఉన్నాయని అంచనా. ప్రతి కణాన్నీ న్యూరాన్‌ అంటారు. ఒక్కో కణం 40,000 ఇతర కణాలతో అనుసంధానితమై ఉంటుంది. ఇలా అనుసంధానితమై ఉండటాన్ని ‘సైనాప్స్‌’ అంటారు. మెదడులోని ఇసుక రేణువంత భాగంలో లక్ష న్యూరాన్లు పొరుగు కణాలతో అనుసంధానితమై 100 కోట్ల కనెక్షన్లు (సైనాప్స్‌) ఏర్పరుస్తాయి. ఇంతటి సంక్లిష్టమైన నిర్మాణం మెదడులో ఉన్నప్పుడు దానికి వ్యాయామాలు కావాలి కదా.

యూజ్‌ ఇట్‌ ఆర్‌ లూజ్‌ ఇట్‌
మనిషికి పదేళ్ల వయసు నుంచి సామాజిక, ఉద్వేగపూరితమైన, బుద్ధికి సంబంధించిన ఎదుగుదల  చాలా వేగంగా ఉంటుంది. అతడి ఎదుగుదలలో ఎదురవుతున్న అనుభవాలతో మెదడులో కొత్త కొత్త సైనాప్స్‌లు  ఏర్పడుతుంటాయి.  చూస్తున్నవీ, వాసన పీలుస్తున్నవీ, వింటున్నవీ, నేర్చుకుంటున్నవీ... ఒక కోడ్‌ రూపంలో న్యూరాన్లలో నిక్షిప్తమవుతాయి. ఒకసారి ఏర్పడిన  జ్ఞాపకం  వేరే సందర్భంలో బయటకు వచ్చి సమస్య పరిష్కారానికి తోడ్పడటం న్యూరాన్ల కనెక్షన్లతో ఏర్పడే ‘సైనాప్స్‌’లనే జరుగుతుంటుంది. ఇలా  తెలివితేటలు (ఇంటెలిజెన్స్‌) వృద్ధి పొందుతుంది. అయితే ఈ ప్రక్రియలో మనం ఏయే అంశాలపై దృష్టి పెడతామో అవి పెరుగుతాయి. దృష్టి పెట్టని అంశాలు తగ్గుతాయి. దీన్నే ‘యూజ్‌ ఇట్‌... ఆర్‌ లూజ్‌ ఇట్‌’గా చెప్పవచ్చు. అంటే ఉపయోగించేవి పెరుగుతూ, ఉపయోగించనివి తగ్గిపోతుంటాయి. ఉపయోగించని వాటిని ఉపయోగంలోకి తెస్తేనే మరిన్ని సైనాప్స్‌లు ఏర్పడి మెదడు చురుగ్గా మారుతుంది. న్యూరోబిక్స్‌ అవసరమయ్యేది అందుకే.
– డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌రెడ్డి,
 సీనియర్‌ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement