ఎందరో నానీలు... | humer plus | Sakshi
Sakshi News home page

ఎందరో నానీలు...

Published Thu, Sep 10 2015 11:37 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

ఎందరో నానీలు... - Sakshi

ఎందరో నానీలు...

హ్యూమర్ ఫ్లస్

భలేభలే మగాడివోయ్ సినిమాలో నానికి మతిమరుపు. ఏదైనా తొందరగా మరిచిపోతాడు. మతిమరుపు జబ్బులా కనిపిస్తుంది కానీ నిజానికి అదో వరం. ఇచ్చిన వాగ్దానాలన్నీ గుర్తుంటే మన రాజకీయ నాయకుల మెదడు ట్రాన్స్‌ఫార్మర్‌లా వేడెక్కి పేలిపోయి వుండేది. ఎక్కడిదక్కడ గ్రక్కున విడువంగవలెను సుమతీ అనేది వాళ్ల పాలీస. ఓటర్లు కూడా అంతే. నాయకుల మాటల్ని మరచిపోతారు కాబట్టే మళ్లీ వాళ్లనే ఎన్నుకుంటారు. మెదడులో డిలిట్ కొట్టే ఆప్న్ లేకపోతే పిచ్చాసుపత్రులు నిండిపోయి వుండేవి.

 ఆ సినిమాలో నాని ప్రత్యేకత ఏంటంటే ఒక పనిచేస్తూ ఇంకో పనిలోకి వెళ్లిపోయి అంతకుముందు చేస్తున్న పనిని మరిచిపోతాడు. గవర్నమెంట్ ఆఫీసులకెళితే మనకు బోలెడుమంది నానీలు కనిపిస్తారు. మనం ఒక పనికోసం వెళ్లి పడిగాపులు కాస్తుంటే ఆ అధికారి మన విషయమే మరిచిపోయి ఇంకేదో పని చేస్తుంటాడు. అది ఎట్లనినన్...

 ‘‘సార్, నేనో సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేశా’’ - బాధితుడు. ‘‘సర్టిఫికెట్లు ఇవ్వడానికే మేముండేది... ఇంతకీ ఏం సర్టిఫికెట్... (ఫోన్ రింగ్) హలో సార్ బావున్నారా... ఏదో మీ దయవల్ల.. ఎక్కడ సార్, పనులెక్కడ జరుగుతున్నాయి... మునుపటిలా కాదు, వర్క్ కల్చర్ పోయింది. నెలలో వారంరోజులు గవర్నమెంట్ సెలవలు, వారం రోజులు ఉద్యోగులు సెలవు.. మిగిలిన రోజుల్లో కాఫీ, టీ, లేట్ కమింగ్ ... ఇవన్నీ పోయి... ఏంటి వర్క్ కల్చర్‌పైన ఫేస్‌బుక్‌లో రాశారా... ఇప్పుడే చూసి లైక్ కొడతా’’ అంటూ నానీ ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి లైక్ కొట్టాడు.

 ‘‘సార్ బర్త్ సర్టిఫికెట్‌కోసం....’ ‘‘ఒక్క నిముషం, బాస్ పిలుస్తున్నాడు.’’ పది నిముషాల తర్వాత నాని విసుగ్గా ‘‘ఏంటో ఈయన మతిమరుపుతో చస్తున్నాను. తీరా పిలిచాకా ఎందుకు పిలిచాడో మరిచిపోయాడు. ఇంతకూ మీరెవరు?’’ ‘‘సార్, బర్త్...’’ ఫోన్ రింగ్ ‘‘సార్, నమస్తే... భలేవారు సార్, మీరు చెబితే మరిచిపోతానా... ఆ ఫినాయిల్ కాంట్రాక్ట్... సారీ పామాయిల్ కాంట్రాక్ట్ కదా... ఆ ఫైల్ రెడీ చేస్తా... వన్ మినిట్ బాస్ నుంచి పిలుపు. ‘‘సార్...’’‘‘వుండవయ్యా, అవతలవాడు చంపుతున్నాడు.. అసలీ బాస్‌లంతా ఇలాగే పీక్కుతింటారా. లేదంటే పీక్క్తునేవాళ్ళే బాస్‌లవుతారా..’’ ఐదు నిముషాల తర్వాత కోపంగా వచ్చి అటెండర్‌ని పిలిచి ‘‘బుద్ధుందా నీకు... గాడిదని పిలవమంటే గుర్రాన్ని పిలుస్తావా? లోపలికెళితే బూతులు తిట్టాడు. ఆ మిస్సయిన ఫైల్ నాది కాదు... వాళ్ళావిడకి మతిభ్రమణం, దాంతో వీడికి మతిమరుపు. మధ్యలో నన్ను కరుస్తున్నాడు.

‘‘మీరు నన్ను కరుస్తున్నారు’’ - అఠెండర్. ‘‘తెలుగు సినిమాలు చూసి చూసి ప్రతివాడికి ఈ పంచ్‌ల గోల ఎక్కువైంది’’.‘‘సార్, నా బర్త్..’’ ‘‘నీ బర్త్... నా చావుకొచ్చేలా వుంది... ఒక కప్పు టీ తాగితే కానీ బుర్ర పనిచేయదు.’’ ‘‘తాగినా పనిచేయదు’’ - అటెండర్.
 ఈ కథ అన్ని ఆఫీసుల్లో ఇలా సాగుతూనే వుంటుంది. మతిమరుపు కొందరికి నిజంగా వుంటే, మరికొందరు తమకు వుందని అనుకుంటూ ఉంటారు. జనరల్‌గా నిర్మాతలు రెమ్యునరేషన్ మరిచిపోతూ వుంటారు. దాంతో కొందరు హీరోలు డబ్బింగ్ థియేటర్‌కి దారిని మరిచిపోతారు. కొందరు భార్యని మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు అప్పుల్ని మరిచిపోతారు, తప్పుల్ని కూడా మరిచిపోతారు. లోకంలో ప్రతివాడు ఏదో ఒకటి మరిచిపోతూనే వుంటాడు. మతిమరుపు అంటే అదో ఇష్టకష్టం.    - జి.ఆర్. మహర్షి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement