లండన్: ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చిన వారిని మనం బహుభాషా కోవిదులు అంటూ కొనియాడుతాం. వారిని అలా పిలవడం ద్వారానే మనకు తెలియకుండానే వారి పట్ల సానుకూల దృక్ఫథం వ్యక్తం చేస్తాం. ఒక్క భాష వచ్చిన వారి మెదడు బాగా పని చేస్తుందా? లేదా రెండు, అంతకంటే ఎక్కువ భాషలు వచ్చిన వారి మెదడు బాగా పనిచేస్తుందా ? అన్న అంశంపై ఎప్పటి నుంచో చర్చ కొనసాగుతోంది. ఒకటికన్నా ఎక్కువ భాషలు నేర్చుకుంటే మెదడు గందరగోళంగా తయారవుతుందని, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై అది ప్రభావం చూపిస్తుందని వాదించేవాళ్లు ఎప్పటి నుంచో ఉన్నారు.
వాస్తవానికి ఒకటికన్నా ఎక్కువ భాషలు వచ్చినవారు, అంటే బహుభాషా కోవిదుల్లో జ్ఞానశక్తి, అవగాహన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ‘బైలింగ్విల్ రిసెర్చ్ బాడీ’ ఒకటి తాజాగా వెల్లడించింది. బహు భాషలు రావడం మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, భాషల మీద పట్టు సాధించడమే కాకుండా కార్యనిర్వాహక సామర్థ్యం కూడా వారిలో పెరుగుతోందని రిసెర్చ్ బాడీ తెలిపింది. పలు భాషలు నేర్చుకోవడం వల్ల మెదడులోని అన్ని ప్రాంతాలు క్రియాశీలకం అవుతాయని, అలా మెదడులోని అన్ని విభాగాలు క్రియాశీలకం కావడం కార్యనిర్వహణా సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తోందని ప్రపంచ బహుభాషా పరిశోధకుల్లో ప్రముఖులైన ఎలెన్ బయాలిస్టాక్ చెప్పారు.
తమిళంతోపాటు ఇంగ్లీషు వచ్చిన భారత్‌కు చెందిన 20 మంది, కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన 20 మందిపై తాము జరిపిన పరిశోధనల వల్ల ఈ విషయం తేలిందని ఆమె అన్నారు. బహు భాషలను నేర్చుకోవడం వల్ల మెదడు స్వరూపంలో కూడా మార్పులు వస్తాయని తాజాగా విడుదలైన మరో సర్వే కూడా తెలియజేస్తోంది. అందుకేనేమో ఒక్క విదేశీ భాషైనా నేర్చుకోవాలనే నియమం యూరప్ లాంటి దేశాల్లో ఉంది.
పది మందిపైనో, పాతిక మందిపైనో అధ్యయనం చేయడం ద్వారా బహు భాషల వల్ల మెదడుకు ప్రయోజనమని వాదించడం సబబు కాదని ప్రముఖ సైకాలజిస్ట్ కెన్నేత్ పాప్ అభిప్రాయపడుతున్నారు. బహు భాషల వల్ల సామాజిక ప్రయోజనం ఉన్న మాట వాస్తవమేనని, దాని ద్వారా జ్ఞానశక్తి వద్ధి చెందుతుందన్న వాదనతో విభేదిస్తున్నానని ఆయన అన్నారు. వచ్చిన ఒకే ఒక్క భాషతోనే వివిధ రంగాలకు సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని ఆయన చెప్పారు.
పలు భాషలు రావడం మెదడుకు మేతే
Published Wed, May 11 2016 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement