ఆస్తమా నుంచి ఉపశమనమెలా...?
నా వయసు 46. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా జబ్బు ఉంది. చలికాలంలో తప్పనిసరిగా బయటపడుతుంది. పిల్లికూతలతో కూడిన ఆయాసం వస్తుంది. దగ్గు కూడా వస్తుంటుంది. చాలా మందులు వాడాను. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వత నివారణకు ఆయుర్వేద మందులు తెలియజేయ ప్రార్థన.
- భ్రమరాంబ, చేవెళ్ల
మీకున్న సమస్యను ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. దీనికి కారణాలు అనేకం. ఉదాహరణకు... అసాత్మ్యత (అలర్జీ) కావచ్చు. ఇది ఆహారపదార్థాలతో రావచ్చు. బాహ్యవాతావరణంలోని అంశాలు కావచ్చు. గాలిలో తేమ, దుమ్ము, ధూళి, మేఘావృత వాతావరణం, అతిశీతల వాతావరణం, మరికొన్ని కంటికి కనిపించని ఇతర పదార్థాలు మొదలైనవి. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి సిమెంట్, కెమికల్స్, ఆయిల్స్ మొదలైనవి పడకపోవచ్చు. కొంతమందికి వారసత్వం ఒక కారణం. మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. కొంతమందిలో జ్వరం కూడా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని ‘యాప్య’ వ్యాధిగా స్పష్టీకరించింది. అంటే పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహార, విహార, ఔషధాల ద్వారా నియంత్రించుకోగల్గిన వ్యాధి అని అర్థం. ఆయాసం ఉన్నప్పుడు విశ్రాంతి అవసరం. పరిశ్రమచేస్తే ఇది మరింత ఎక్కువవుతుంది. చలి నుంచి కాపాడుకోవాల్సిన దుస్తులు ధరించాలి. కొంచెం బోర్లా పడుకునే భంగిమలో ఉపశమనం లభిస్తుంది. ఆయాసం తగ్గేవరకు వేడివేడిగా ఉండే తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. చల్లటి వస్తువులను దూరంగా ఉంచాలి.
మందులు
ఆయాసంగా ఉన్నప్పుడు కనకాసవ లేదా సోమాసవ (ద్రావకం) మూడు చెంచాల మందులో సమానంగా గోరువెచ్చని నీరు కలిపి, రోజుకి మూడు లేక నాలుగు సార్లు తాగాలి.
దగ్గు, కఫం తగ్గడానికి: వాసారిష్ట, పిప్పలాసవ... ఈ రెండు ద్రావకాలను రెండేసి చెంచాలు ఒక గ్లాసులో పోసుకొని, నాలుగు చెంచాలు నీళ్లు కలిపి, రోజుకి మూడుసార్లు తాగాలి.
భారంగ్యాది చూర్ణం: ఒక చెంచా చూర్ణం రోజుకి రెండుసార్లు, వేడినీటితో కర్పూరతైలాన్ని ఛాతీకి ముందు, వెనక వైపు పూతగా పూసి (మెల్లగా మసాజ్ చేసి), వేడినీటి ఆవిరితో కాపడం పెట్టాలి. ఆయాసం తగ్గిన అనంతరం ఈ కింది ఔషధాలను రెండు మూడు నెలలపాటు వాడితే ‘క్షమత్వం’ వృద్ధి చెంది తమక శ్వాస వచ్చే తీరు బలహీనపడుతుంది.
శృంగారాభ్రరస మాత్రలు: ఉదయం 1, రాత్రి 1 అగస్త్యహరీతకీ రసాయన
(లేహ్యం): ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించి తిని, పాలు తాగాలి.
గృహవైద్యం
ఒక చెంచా ఆవనూనె, ఒక చెంచా తేనె కలిపి సేవిస్తే ఆయాసం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంతో చేసిన టీ రోజుకి నాలుగైదు సార్లు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రెండు చిటికెలు ఇంగువను బెల్లంతో తిన్నా ప్రయోజనం ఉంటుంది
ఆయాసం లేనప్పుడు, రెండుపూటలా ప్రాణాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకుంటే పుప్ఫుసాలకు (ఊపిరితిత్తులకు) క్రియాపరమైన సామర్థ్యం పెరుగుతుంది. ఇది పరిశోధనాశాస్త్ర నిరూపితం.
గమనిక: కొంతమంది నాటువైద్యులు, నకిలీవైద్యులు ఈ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని అనేక ప్రకటనలు, ప్రచారాలు చేస్తూ వారి వారి మందులు అమ్ముకుంటుంటారు. ఇలాంటి మోసాలకు బలికావద్దు. మరికొంతమంది కొన్ని ఆయుర్వేద మందులలో అల్లోపతికి సంబంధించిన ‘స్టెరాయిడ్స్’ కలిపి అమ్ముతుంటారు. స్టెరాయిడ్స్ వల్ల నాటకీయ ప్రయోజనం కలుగుతుంది. ఆ విధంగా వారి వలలో పడతారు. ఇది ప్రమాదమని గ్రహించాలి. మీకు దేనివల్ల ఆసాత్మ్యత కలుగుతోందన్న అంశాన్ని లేదా ఇతర కారణాలను గమనించగలిగితే దానిని దూరం చేయాలి. దీనిని ‘నిదానపరివర్జనం’ అంటారు.
డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
హుమయున్ నగర్, హైదరాబాద్