హార్ట్‌ ఫెయిల్యూరా?  | Heart failure It should take full rest | Sakshi
Sakshi News home page

జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులివి... 

Published Wed, Feb 13 2019 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Heart failure It should take full rest - Sakshi

నా వయసు 68 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి, పాదాల వాపు కనిపించింది. డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేసి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ అని చెప్పారు. జీవన శైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని కూడా అన్నారు. నేను నా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటో సూచించండి. 

మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... 

ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదం, జీడిపప్పు, ఆక్రోటు వంట్‌ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్‌ వంటివి ఉపయోగించుకోవచ్చు. 

ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. 

విశ్రాంతి: గుండె వైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. 

►మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్‌ ఫెయిల్యూర్‌), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. 

ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్‌ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. 

వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం.  అందుకే తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. 

అరిథ్మియాఅంటే ఏమిటి? 

నా వయసు 37 ఏళ్లు. రెండు వారాల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహ వచ్చాక కూడా చాలా నీరసంగా ఉంది. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నాయి. చాలా ఆయాసంగా ఉంది. ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా కావచ్చు  అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. 
 
సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు  కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్‌ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు.


ఈ లక్షణంతో మరి కొన్నిరకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్‌ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్నిరకాల జబ్బులకు మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి.

- డాక్టర్‌ అనూజ్‌ కపాడియా, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

సీఏబీజీ సర్జరీ అంటే ఏమిటి? 

నా వయసు 67 ఏళ్లు. ఇటీవల ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని చెప్పారు. అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. 

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు,  రక్తసరఫరాకు అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్‌ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా ‘బైపాస్‌ సర్జరీ’ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్‌. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్‌ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్‌ (అడ్డంకి)ని బైపాస్‌ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం.

గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్‌ చేసే ప్రక్రియను రీ–వా స్క్యులరైజేషన్‌ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్‌ అయిన నాళాల వద్ద బైపాస్‌ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్‌ సర్జరీ చేస్తారు.

అంతేతప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్‌ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్‌ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్‌ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement