కిరాతకం
- కుటుంబ సభ్యులను రాడ్డుతో కొట్టి వ్యక్తి ఆత్మహత్య
- చికిత్స పొందుతూ కుమార్తె మృతి
బాలానగర్, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి లోనైన ఓ వ్యక్తి కుటుంబసభ్యులను రాడ్డుతో కొట్టి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు కుమార్తె కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన రాములు (44) భార్య కృష్ణమ్మ, పిల్లలతో కలిసి గత కొన్నేళ్లుగా నగరానికి వచ్చి బాలానగర్ గౌతమ్‌నగర్‌లో ఉంటున్నాడు. ప్లంబర్‌గా పనిచేస్తుంటాడు. కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాములుకు బీపీతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో చికాకుగా ఉంటూ కుటుంబ సభ్యులను కొట్టి హింసిస్తుండేవాడు.
దీనికితోడు మానసికంగా కుంగిపోతున్న రాములు.. గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భార్య కృష్ణమ్మ, కుమార్తెలు భవాని (15), శివాని, కుమారులను నిద్రలో నుంచి లేపాడు. భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రాములు భార్య కృష్ణమ్మ, పెద్దకుమార్తె భవాని, శివాని, కుమారులను రాడ్డుతో చితకబాదాడు. దీంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
భయాందోళనకు గురైన చిన్న కుమార్తె శివాని కిందకు వెళ్లి విషయం పక్కింటి వారికి చెప్పింది. దీంతో వారు పైకి వచ్చారు. ఇదే సమయంలో రాములు మూడవ అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్రగాయాల పాలైన రాములు, భార్య కృష్ణమ్మ, కుమార్తె భవానిలను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. ఆ రాత్రే రాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కుమార్తె భవానికి కూడా తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. భార్య కృష్ణమ్మ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యుల బాధ వ ర్ణించనలవి కాకుండా ఉంది. వీరి రోదన చూసినవారి హృదయాలను ద్రవించి వేసింది. బాలానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.