సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సంస్థ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ కావడం.. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... కర్నూలుకు చెందిన ఈశ్వరయ్య విజయవాడ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.
ఆయన కుమారుడు సి.ప్రవీణ్‌కుమార్ (24) కరీంనగర్‌లో బీటెక్ చదివి, హైదరాబాద్‌లో ఎంటెక్ చేశారు. అనంతరం క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికై గత అక్టోబర్ 31న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధుల్లో చేరాడు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటూ.. ఆఫీసుకు వెళ్లి వచ్చేవాడు. అయితే, శుక్రవారం ఉదయం 8 గంటలకు తన రూమ్‌మేట్, సహోద్యోగి అయిన ప్రసన్నతో కలిసి టిఫిన్ తిన్నాడు.
తర్వాత డ్యూటీకి వస్తానని చెప్పి, ప్రసన్నను పంపేసి.. హాస్టల్‌లో ఉండిపోయాడు. ప్రవీణ్ ఆఫీసుకు రాకపోవడంతో.. లంచ్ సమయంలో ప్రసన్న వచ్చి చూడగా హాస్టల్ గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. హాస్టల్ నిర్వాహకుడి సమాచారం మేరకు పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా... ప్రవీణ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు.
ఇటీవల కంపెనీ నిర్వహించిన పరీక్షలో ప్రవీణ్ ఫెయిలైనట్లు తెలిసింది. దాంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెప్పారు. కాగా.. ప్రవీణ్ సోదరి ప్రసన్నకుమారి మెడిసన్ చదువుతూ ఆరు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఆ బాధతో పాటు కంపెనీ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే పేర్కొంటున్నారు.