మనిషికి గర్భశోకానికి మించిన శాపమేముంది. అల్లారు ముద్దుగా పెంచి, అడిగింది అందించి, ఉన్నత విద్యావంతులను చేస్తే...తల్లిదండ్రుల శ్రమ, ఆశ ఫలించే దశలో ఆ బిడ్డలే బలవన్మరణం పొందితే అంతకు మించి కష్టం, నష్టం ఏముంటుంది. జిల్లా జైలు పర్యవేక్షణాధికారి సీహెచ్ ఈశ్వరయ్య కుటుంబంతో విధి ఈ విషాద నాటకమే ఆడుకుంది. నిరుడు ఎంఎస్ చేస్తున్న కూతురు, నేడు సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కొడుకు బలవన్మరణానికి గురయ్యాడు.
అనంతపురానికి చెందిన సీహెచ్ ఈశ్వరయ్య ఏడాది కాలంగా ఇక్కడ జిల్లా జైలు పర్యవేక్షణాధికారిగా వ్యవహిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చదివిన ప్రవీణ్ కుమార్ డీఎల్ఎఫ్ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే అతను ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈశ్వరయ్యే తరచూ హైదరాబాద్ వెళ్లి కుమారుని యోగ క్షేమాలు తెలుసుకుని వస్తుండేవారు. కుమారుని అకాల మృతి వార్తతో హుటాహుటీన హైదరాబాద్ వెళ్లారు. కాగా ప్రవీణ్ కుమార్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కాగా గత ఏడాది జూన్ 24న ఈశ్వరయ్య కుమార్తె హరిప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎం.ఎస్ చేస్తున్న ఆమె ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈశ్వరయ్య కుటుంబాన్ని ప్రవీణ్ ఆత్మహత్య మళ్లీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.
'విధి ఆ కుటుంబంతో వింత నాటకం ఆడుకుంది'
Published Sat, Jan 25 2014 9:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement