కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్‌కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్‌సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం.
నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు
ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు.
నిద్రపై శాస్త్రీయమైన దృష్టి
నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్‌సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది.
నిద్ర అంటే...
మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్‌ఆర్‌ఈఎం, ఆర్‌ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్‌గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్‌ఆర్‌ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్‌ఆర్‌ఈఎమ్‌లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు.
నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్‌ఆర్‌ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్‌ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్‌ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్‌ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.)
నిద్రలేమితో వచ్చే సమస్యలు
నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్‌కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు
∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ
∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం
∙దిగులు ∙మానసిక కుంగుబాటు
∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు
నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం
మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు...
మంచి నిద్ర కోసం...
►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం
► రోజూ వ్యాయామం చేయడం
►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు
►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు
►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు.
►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు.
►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి.
►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి.
కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు
మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని...
►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు.
►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ.
►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు.
►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు.
జాగారంలో రికార్డు
మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్‌లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు.
– పన్యాల జగన్నాథదాసు
నిద్ర సంబంధమైన సమస్యలు
కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment