
నిద్రలేమి దీర్ఘకాలికంగా కొనసాగితే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే. కొందరిలో నిద్రలేమి మానసిక, శారీరక సమస్యల వల్ల తలెత్తే సమస్య. అయితే, ఇంకొందరు తాము నిర్వర్తించే విధుల కారణంగా అనివార్యంగా నిద్రకు దూరమవుతుంటారు. కారణాలు ఏవైనా, తగిన నిద్ర లేకుండా ఒక్క రాత్రి గడిపినా, దాని ప్రభావం మెదడుపై పడుతుందని అమెరికన్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క రాత్రి నిద్రలేమితో గడిపినా, అది అల్జీమర్స్‌తో పాటు పదిరకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే అవకాశాలను పెంచుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి ఫలితంగా మెదడులో అమిలాయిడ్ బీటా ప్రొటీన్లు సహా నానా వ్యర్థాలు నిండిపోతాయని, ఇవి మెదడులోని కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు వారు చెబుతున్నారు.